శ్రీవారి సొమ్ముల భద్రతపై అనుమానాలు..

Update: 2019-08-28 01:31 GMT

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి సన్నిధి సర్వజనులకు రక్ష. గోవింద నామస్మరణతో శ్రీవారి కరుణా కటాక్షాలు పొందే పవిత్ర క్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రం. కోట్లాది మంది భక్తులు కొలుచుకునే క్షేత్రంలో ఆలయ అధికారుల తీరు భక్తుల ఆగ్రహానికి కారణం అవుతోంది. తిరుమల శ్రీవారి సొమ్ముల భద్రతపై అనుమానాలకు తావిస్తోంది.

ఆ దేవదేవుడి నిత్య అలంకరణ నగలు మినహా.. మిగిలిన నగలను ట్రెజరీలోనే భద్రపరుస్తుంది టీటీడీ. కట్టుదిట్టమైన భద్రత మధ్య నగల రక్షణకు ఢోకాలేదని ఆలయ అధికారులు పదే పదే చెబుతుంటారు. కానీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు స్వామివారి నగల భద్రతపై సందేహాలు కలిగిస్తున్నాయి. ట్రెజరీ నుంచి 5 కిలోల వెండి కిరీటం.. మరో నాలుగు బంగారు అభరణాలు మాయమవటం టీటీడీలో కలకలం రేపుతోంది.

టీటీడీలో ఆభరణాల మాయంపై వివరణ ఇచ్చారు ఈవో అనిల్‌ కుమార్ సింఘాల్‌. టీటీడీ ట్రెజరీలో వెండి కిరీటం, నాలుగు బంగారు నగల మిస్సింగ్ నేపథ్యంలో మరోసారి ఆభరణాల లెక్కింపు చేపడతామని ఆయన ప్రకటించారు. 2018లో ఐదు కేజీల వెండి కిరీటంతో పాటు బంగారు ఉంగరాలు లేవని గుర్తించామన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఈ మొత్తాన్ని టీటీడీ అధికారి శ్రీనివాసరావు జీతం నుంచి రికవరీ చేస్తున్నామన్నారు.

మరోవైపు ఢిల్లీలో నాలుగు కోట్ల టీటీడీ నిధులు దుర్వినియోగం అయ్యాయని వార్తలు రావడం నిరాధారమన్నారు ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్. ఎవరికైనా సరే ఢిల్లీలో నిధుల ఖర్చులపై వివరాలు అందిస్తామన్నారు.

ట్రెజరీలో నగలు మాయం అయినట్లు గుర్తించినా.. ఇన్నాళ్లు గుట్టుగా దాచటం.. పూర్తి స్థాయి విచారణ లేకుండా ఏఈవోను బాధ్యుడిగా నిర్ధారిస్తూ రికవరీతో సరిపెట్టడం విమర్శలకు తావిస్తోంది. అయితే టీటీడీ అధికారులు మాత్రం సెప్టెంబర్‌లో మరోసారి లెక్కింపు చేస్తామని.. ఆభరణాలు తగ్గితే ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Similar News