ఒకే రోజు ఇద్దరు అధినేతల పర్యటన.. వేడెక్కిన నెల్లూరు రాజకీయం

Update: 2019-10-15 04:00 GMT

నెల్లూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ బలోపేతం, కార్యకర్తల్లో ధైర్యం నింపడమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. మంగళవారం మరికొన్ని నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.

గతానికంటే భిన్నంగా చంద్రబాబు ప్రసంగం కొనసాగుతోంది. వైసీపీ సర్కార్‌ వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతూ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమి తరువాత రెండోసారి చంద్రబాబు సింహపురి పర్యటనకు రావడంతో.. జిల్లా పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఏపీలో అధికార పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని.. దాడులు ఇలాగే కొనసాగితే సీఎం జగన్‌ను ఇంటికి పంపడం ఖాయమని స్ట్రైట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. జే-టాక్స్ పేరుతో మద్యం, లిక్కరు రేట్లు పెంచారంటూ జగన్‌పై ఫైర్‌ అయ్యారు చంద్రబాబు

మంగళవారం నెల్లూరులో చంద్రబాబుతో పాటు సీఎం జగన్‌ కూడా పర్యటించడం ఉత్కంఠ రేపుతోంది. రైతు భరోసా అంటూ రైతులను మోసం చేస్తున్నారని.. నెల్లూరు పర్యటనలో సీఎం జగన్‌ను నిలదీయాలని సోమవారం సమావేశంలో చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ పథకానికి ఎవరు అర్హులో కూడా ప్రభుత్వం దగ్గర లెక్కల్లేవన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం రైతు భరోసా పథకంలో లోపాలే లక్ష్యంగా వైసీపీ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టనున్నారు టీడీపీ అధినేత. రైతు భరోసా పేరుతో రైతులను ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో వివరించనున్నారు. ఒకే రోజు ఇద్దరు అధినేతల పర్యటనతో నెల్లూరు రాజకీయం వేడెక్కింది.

Similar News