మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నయంగా చెప్పుకుంటున్న కమలనాథులు.. గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, వార్డుల్లో పోటీకి సై అంటున్నారు. గతంలో ప్రభావం చూపించిన మున్సిపాలిటీలతో పాటు బలంగా ఉన్న చోట, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వివిధ మున్సిపాలిటీల్లో కీలకంగా ఉండి ప్రస్తుతం న్యూట్రల్‌గా ఉన్న నేతలకు ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న బీజేపీ .. ఓటర్లను కలిసేలా నాయకులకు దిశానిర్దేశం చేస్తోంది. పాత ముఖ్యనేతలకు కొత్త నేతలు కలిస్తే తిరుగుండదని బీజేపీ భావిస్తోంది.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధమంటోంది. ఇందులో భాగంగా పార్టీలోని సీనియర్ నేతలకు మున్సిపాలిటీల బాధ్యతలను అప్పగించింది. పురపాలక ఎన్నికల కోసం నాలుగు నెలలుగా కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్‌ను మినహాయించి మిగిలిన 15పార్లమెంట్ స్థానాలను 15క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌కు పాత కొత్త నేతలతో కలసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్ ఒక సీనియర్ నేతను పరిశీలకుడిగా బీజేపీ నాయకత్వం నియమించింది. వీటితో పాటు బీజేపీ ఎంపీలున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ క్లస్టర్లపై బీజేపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. 2014లో ఉమ్మడి ఏపీలో జరిగిన పురపాలక ఎన్నికల్లో భువనగిరి, నారాయణపేట, కామారెడ్డి లాంటి మున్సిపాలిటీల్లో బీజేపీ ప్రభావం కనిపించింది. గతంలో ప్రభావం చూపించిన మున్సిపాలిటీల్లో కూడా కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మరోమైపు CAA, NRCల ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై ఉండదని బీజేపీ నేతలంటున్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధం లేదని సమర్థించుకుంటున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలు తమకు కలిసొస్తాయని తెలంగాణ బీజేపీ విశ్వసిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో తమకున్న పట్టుతో మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితమైన ప్రభావం చూపాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు అవకాశమివ్వకూడదని బీజేపీ భావిస్తోంది. 2023లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని ప్రజలకు నమ్మకం కలగాలంటే.. మున్సిపల్ ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని కాషాయ పార్టీ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మున్సిపాలిటీలను గెలిస్తేనే తమకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశముంటోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి తెలంగాణ బీజేపీ నాయకులకు ఆదేశాలు అందాయని సమాచారం. మొత్తంగా హుజుర్ నగర్ ఉపఎన్నికల ఫలితాలతో కంగుతిన్న కమలనాథులు ఈ మున్సిపల్ ఎన్నికలకు ముందుగానే కసరత్తులు ప్రారంభించారు.