ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పట్టిన హైకోర్టు

Update: 2020-01-28 10:57 GMT

ఏపీ ప్రభుత్వ తీరును మరోసారి హైకోర్టు తప్పు పట్టింది. విద్యార్థులను ఇంగ్లీష్‌ మీడియం పేరుతో నిర్బంధిస్తే కుదరదని స్పష్టం చేసింది. ఏపీలో ఆరో తరగతి వరకు నిర్బంధంగా ఇంగ్లిష్‌ మీడియాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దాని అమలుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లిష్‌ మీడియంలోనే విద్యార్థులు చదవాలని నిర్బంధించలేమని అభిప్రాయపడింది. అలా చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించడమే అని స్పష్టం చేసింది.

ఇంగ్లిష్‌ మీడియం కోసం పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణ తరగతులు తదితర చర్యలు చేపడితే అధికారులకు ఇబ్బందులు తప్పవని హైకోర్టు హెచ్చరించింది. ఈ వ్యవహారంపై ముందుకెళితే ఆ ఖర్చును బాధ్యులైన అధికారుల నుంచే రాబడతామని తేల్చి చెప్పింది. పూర్తిగా ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దాఖలు చేయడంలో విఫలమైతే స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోపు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ఇంగ్లిష్‌ మీడియంపై ఉత్తర్వులు ఇస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.

Similar News