పద్దతులు నచ్చలేదని వెళ్లిపోయే వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. పవన్ కళ్యాణ్

Update: 2020-02-02 13:20 GMT

తాను వ్యక్తిగత లాభం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. అలా అనుకుంటే పార్టీ పెట్టేవాడినే కాదన్నారు. విజయవాడ తూర్పు నియోజవర్గ కార్యకర్తలతో సమావేశమైన జనసేనాని.. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలప్పుడు చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి.. ఇప్పుడు తన పద్దతులు నచ్చలేదని విమర్శించి వెళ్లిపోయే వాళ్ల మాటలు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భావజాలం కలవనప్పుడే మనుషులు విడిపోతారని అన్నారు. ఇష్టంతో వుండాలి తప్ప.. బలవంతంగా ఎవరినీ పార్టీలో వుంచలేమని తెలిపారు. రాజీనామాలు చేస్తున్నవారెవరూ కూడా పార్టీ స్థాపించినప్పుడు లేరని.. పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో ఉన్నది కేవలం జనసైనికులు, ఆడపడుచులేనని పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభాపతిగా.. నాదెండ్ల మనోహర్‌ ఎంతో ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. ఆయన పార్టీలోకి రావడానికి ముందు సంవత్సరం పాటు మాట్లాడుకున్నామని పవన్ తెలిపారు. దేశ సమగ్రతను కాపాడే రాజకీయమే చేయాలని,.. ప్రాంతాలు, మతాలను విభజించే రాజకీయం చేయకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నామని అన్నారు. కానీ, కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతూ.. తన పద్దతి గురించి విమర్శిస్తున్నారని.. అలాంటివారు పార్టీకి అవసరం లేదన్నారు. నిజమైన పార్టీ నిర్మాణం ఇప్పుడే మొదలైందని... పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలు అద్భుతమైన అవకాశం అన్నారు పవన్. పార్టీ కోసం కష్టపడి పని చేసేవారికి పెద్ద పేట వేస్తామని తెలిపారు.

తనకు వేలకోట్ల ఆస్తులు లేవన్నారు పవన్. నెలకో కోటి రూపాయల ఆదాయం వస్తే సినిమాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అవి లేకనే సినిమాలు చేస్తున్నానని తెలిపారు. కాపలా కాస్తూ కూర్చునే రాజకీయాలు చేయనని.. వ్యక్తిగత లాభమే చూసుకుంటే జనసేన పార్టీ పెట్టేవాడినే కాదన్నారు. అలా ఆలోచిస్తే బీజేపీలో చేరి కోరుకున్న పదవులు అనుభవించేవాడినని అన్నారు. సమాజహితం కోరుకున్న వాడిని కాబట్టే దెబ్బలు తినడానికైనా సిద్ధపడే జనసేన పార్టీ పెట్టానని పవన్ తెలిపారు.

Similar News