జగన్‌ సీఎం అయ్యాక ఆయనకు పోస్టింగూ ఇవ్వలేదు.. తాజాగా సస్పెన్షన్‌

Update: 2020-02-09 12:22 GMT

ఏపీలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. విచారణ పూర్తయ్యేదాకా ఆయన హెడ్‌క్వార్టర్స్‌ వదిలి వెళ్లడానికి వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అర్ధరాత్రి జీవో జారీచేశారు. క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో ఉన్నందున.. అఖిల భారత సర్వీసు నిబంధనల కింద ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. అదనపు డీజీగా ఉన్న సమయంలో భద్రతా పరికరాల కొనుగోలులో ఆయన ఇష్టానుసారం వ్యవహరించారని ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆయన్ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు సీఎస్‌ పేర్కొన్నారు.

సస్పెన్షన్‌ కాలంలో ఆయన విజయవాడలోనే ఉండాలని.. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ వదిలి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. మొదటి నుంచీ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ టార్గెట్‌గా చేసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయనపై పదే పదే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. దీంతో కమిషన్‌ ఆయన్ను ఆ పదవి నుంచి బదిలీచేసింది. జగన్‌ సీఎం అయ్యాక ఆయనకు ఇంతవరకు ఎలాంటి పోస్టింగూ ఇవ్వలేదు. తాజాగా సస్పెన్షన్‌ వేటు వేశారు.

Similar News