షాహీన్‌బాగ్ ఉద్యమంలో కొత్త మలుపు

Update: 2020-02-18 16:31 GMT

షాహీన్‌బాగ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వంతో చర్చలకు అంగీకరించారు. సుప్రీంకోర్టు ప్రతినిధులతో మధ్యవర్తిత్వానికి ఓకే చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై నిరసనకారులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని కోరారు. చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేయడం ప్రజల హక్కు అని కోర్టు చెప్పడాన్ని ఆందోళనకారులు స్వాగతించారు. ఐతే, నిరసన వేదిక స్థలాన్ని మార్చడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు మధ్యవర్తులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆందోళనకారులు తెలిపారు. షాహిన్‌బాగ్ వేదికను మార్చడంపై ఆందోళనకారులు అందరితోనూ మాట్లాడాల్సి ఉంటుందన్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో 2 నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. రోడ్లను దిగ్బంధించి మరీ నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైనే టెంట్లు వేసి తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేస్తున్నారు. నెలల తరబడి సాగుతున్న ఆందోళనలతో షాహిన్‌బాగ్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేయడం ప్రజల హక్కు అంటూనే రోడ్లను దిగ్బంధించడం మంచి పద్దతి కాదని మందలించింది. నిరసనకారులతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, సాధన రామచంద్రన్, మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజహట్ హబీబుల్లాతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ షాహిన్‌బాగ్ నిరసనకారులతో చర్చలు జరపనుంది.

 

Similar News