తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే చాలు కరోనా అనుమానంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విశాఖలో మూడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడు అనుమానిత కేసులు వెలుగు చూడగా విజయవాడలోనూ ఓ అనుమానితుడి బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్‌కు పంపారు వైద్యులు.. విశాఖలో ఓ కుటుంబానికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో వారికి చెస్ట్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే వారంతా సింగపూర్ వెళ్లి వచ్చారు. జలుబు, దగ్గు, తీవ్రమైన జ్వరం ఉండటంతో అనుమానంతో వారిని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. రక్త నమూనాలు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపారు వైద్యులు.
ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతని బ్లడ్ శాంపిల్స్ కూడా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రెండు కరోనా అనుమానిత కేసులు వచ్చాయి. ఇద్దరినీ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితుల్లో ఒకరు గత నెల 18న మస్కట్ నుంచి జిల్లాకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. రెండు అనుమానిత కేసులు వెలుగు చూడటంతో జిల్లాలో భయాందోళనలు నెలకొన్నాయి. అటు విజయవాడలోనూ కరోనా అనుమానిత కేసు వెలుగు చూసింది. ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. ఇటీవలే జర్మనీలో 17రోజులు బస చేసి వచ్చాడు. జర్మనీతోపాటు, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లినట్లు ఆ వ్యక్తి వైద్యులకు తెలిపారు. ఇతని రక్త నమూనాలను పుణె ల్యాబ్‌కు పంపారు.
తెలంగాణలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. వైరస్ అనుమానంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గాంధీ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. జలుబు, దగ్గు కనబడితే చాలు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అటు కరోనా వైరస్ వ్యాప్తితో ఐటీ కంపెనీలు కూడా అలర్ట్ అయ్యాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి పలు ఐటీ కంపెనీలు. దీంతో ఉద్యోగులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. మైండ్ స్పేస్‌లో ఓ యువతికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురవుతున్నారు. కరోనా భయంతో మైండ్ స్పేస్ ఖాళీ అయిపోయింది. మరోవైపు గాంధీ ఆస్పత్రిలో కరోనా ఐసోలేషన్ వార్డ్ అనుమానితులతో నిండిపోయింది.
అటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా ఆస్పత్రి ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అనంతగిరితోపాటు మరో రెండు ప్రాంతాలు పరిశీలిస్తోంది. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రితోపాటు ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని కరోనా ట్రీట్‌మెంట్ కోసం కేటాయించాలని భావిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డు ఫుల్ అయిపోవడంతో ఇతర రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి దూరంగా ఆస్పత్రి ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.