మనీ పవర్‌తో గ్లోబ్‌పై ఉన్న దేశాలను శాసించే అమెరికాను కంటికి కనిపించని శత్రువు వణికిస్తోంది. యుద్ధాలు చేసినపుడు కూడా జరగని ప్రాణ నష్టం.. కరోనా వల్ల అమెరికాలో జరుగుతోంది. వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య అక్షరాల లక్ష దాటింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్-19 మరణాల్లో.. 28 శాతానికి పైగా ఒక్క USలోనే సంభవించాయి. వైరస్ సోకిన వారి సంఖ్య అక్కడ 17 లక్షల 25 వేలు దాటింది. కొత్తగా 19 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా... దాదాపు 800 మంది చనిపోయారు. ప్రాణ నష్టంతోపాటు.. అమెరికా ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చింది కరోనా వైరస్.
న్యూయార్క్ రాష్ట్రంలో అత్యధికంగా 3 లక్షల 70 వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఆ ఒక్క రాష్ట్రంలోనే దాదాపు 30 వేల మందికిపైగా జనం మృత్యువాతపడ్డారు. న్యూ జెర్సీలో 11 వేలు, మసాచుసెట్స్ 6 వేల మందికిపైగా.. మిషిగన్, పెన్సిల్వేనియాల్లో చెరో 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇల్లినాయిస్, కాలిఫోర్నియా, కనెక్టికట్, లూసియానా, మేరీలాండ్‌లో వైరస్ తీవ్రత కొనసాగుతోంది. అయితే గతంతో పోల్చితే.. అమెరికాలో క్రమంగా వైరస్ తీవ్రత తగ్గుతోందని లెక్కలు చెబుతున్నాయి.
వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా.. కరోనా విస్తరిస్తున్నా.. అగ్రరాజ్యం నిర్లక్ష్యమే వారి పాలిట శాపంగా మారింది. వైరస్ విస్తరిస్తున్నా లాక్‌డౌన్‌కు ట్రంప్ సర్కార్ ఆసక్తిచూపలేదు. ప్రజల ప్రాణాలకన్నా.. దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాతి కాలంలో.. మొదట్లో చూపిన నిర్లక్ష్యమే... జనం ఉసురుతీస్తోంది. కేసులు పెరిగి ప్రజల వేలల్లో ప్రజలు మరణిస్తుంటే... తీరిగ్గా నిద్రలేచిన ట్రంప్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. ఎట్టకేలకు లాక్‌డౌన్‌తోపాటు ఆంక్షలు విధించింది.
33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో... ఇప్పటి వరకు ఒక కోటి 55 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల జనాభాలో 46 వేల టెస్టులు చేశారు. ఇక ప్రతి 10 లక్షల మందిలో 304 మరణాలు సంభవిస్తున్నాయి. వైరస్ ఉధృతిపై.. WHO తాజాగా సూచనలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి ఇంకా మొదటి దశలోనే ఉందని.. తెలిపింది. రెండో దశ వ్యాప్తి మొదలైందని వస్తున్న వార్తల్ని ఖండించింది. తొలిదశలోనే కేసులు పెరుగుతున్నాయని.. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. కేసులు ఎక్కువగా ఉన్న దేశాల్లో జనసంచారంపై నిషేధాజ్ఞలు కొనసాగించాలని సూచించింది.