వైసీపీ ఏడాది పాలనపై బీజేపీ కన్నెర్రజేసింది. జగన్ ప్రభుత్వం సొమ్మొకడిది సోకొకడిది అన్న రీతిలో వ్యవహరిస్తోందంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది.. సీఎం జగన్ ఏడాదిలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ. అనుభవ రాహిత్యం, అసమర్ధత, అవినీతి, అవగాహన లేకపోవడం, ఆత్రం, పోలీసు రాజ్యం, రివర్స్ టెండరింగ్.. ఇదే జగన్ ఏడాది పాలన అంటూ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పరంగా లిక్కర్ పాలసీ అమలు చేస్తామన్న ప్రభుత్వం.. కొన్ని బ్రాండ్లకు మాత్రమే అనుమతిచ్చారని బీజేపీ నేతలు ఫైరయ్యారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదు అనడానికి హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన 65 తీర్పులే నిదర్శనమన్నారు. ఏడాది కాలంలో తన అసమర్థతను చాటుకున్న జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని కన్నా డిమాండ్ చేశారు.
కేంద్రం అమలు చేస్తున్న పథకాలను.. ఏపీ ప్రభుత్వం పేరు మార్చి నిధులను మళ్లిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఆరోగ్యశ్రీకి కేంద్రం నిధులు ఇస్తున్న నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ పేరుతోనే పథకాన్ని అమలు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని.. నవరత్నాల పేరుతో ప్రజల్ని జగన్ మోసం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు మండిపడ్డారు. జగన్ ఓ విఫలమైన సీఎం అని.. ఏడాది పాలనంతా తాను చెప్పిన ఎనిమిది క్యాప్షన్స్ ప్రకారమే నడిచిందని ఎద్దేవా చేశారు.