డాక్టర్ సుధాకర్ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ

Update: 2020-06-02 09:03 GMT

ఏపిలో అరెస్టైన వైద్యుడు సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు అతడికి వైద్యం అందించిన వైద్యులను, అక్కడి అధికారుల నుంచి సమాచారం సేకరించిన సీబీఐ అధికారులు... వైద్యుడి కుటుంబ సభ్యులను విచారించారు. అరెస్టు రోజు ఏం జరిగింది అనేదానిపై వివరాలను సేకరించారు. వైద్యుడి పట్ల పోలీసులువ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా సుధాకర్ కుమారుడు లలిత్ ను సీబీఐ బృందం అధికారులు విచారించారు.

కేసు విచారణలో భాగంగా విశాఖలోని నాల్గవ పట్టణ పోలీస్టేషన్ కు చేరుకున్న సీబీఐ బృందం... స్టేషన్ లో సుధీర్ఘ విచారణ కొసాగించారు. వైద్యుడిని అరెస్టుచేసిన రోజు డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు, హోంగార్డులను పిలిపించి విచారించారు. ఎన్నిగంటలకు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో ఎందుకు తీవ్రంగా ప్రవర్తించాల్సి వచ్చింది. అక్కడ ఏం జరిగింది? అనే అంశాలపై పోలీసుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈస్ట్ జోన్ ఏసీపీ కులశేఖర్, ద్వారకా జోన్ ఏసీపీ ఆర్వీఎస్ ఎన్ మూర్తి తోపాటు పలువురు అధికారులను కూడా ప్రశ్నించారు. అంతకు ముందు సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లిన సీబీఐ అధికారులు.. అక్కడ ఏం జరిగింది అనేదానిపై ఆరా తీశారు.

వైద్యుడి కేసును విచారణ చేస్తున్న సీబీఐ బృందాన్ని సుధాకర్ తల్లి కావేరిబాయి,దళిత నేతలు కలిశారు. సుధాకర్ పట్ల పోలీసులు వ్వవహరించిన తీరును వారు అధికారులకు వివరించారు. వైద్యుడి విషయంలో దురుసుగా వ్యవహరించిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సుధాకర్ తల్లి కావేరీ బాయి ఈమేరకు వారికి ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

వైద్యుడి కేసులో ఎఫ్‌ ఐఆర్ నమోదుచేసిన సీబీఐ అధికారులు.. విచారణను ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్ రాధారాణి, వైద్యం అందించిన డాక్టర్ రామిరెడ్డిని విచారించిన అధికారులు.. అరెస్టుచేసిన పోలీసులను, వైద్యుడి కుటుంబ సభ్యులనుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని క్రోడీకరించి కేసును దర్యాప్తు చేయనున్నారు.

Similar News