అలవాటు పడ్డ ప్రాణం మానుకోలేక పోతోంది. సాయింత్రం ఆరైతే చాలు మద్యం దుకాణాల వైపే మందుబాబుల అడుగులు పడుతుంటాయి. సంపాదించిన దాంట్లో సగం మద్యానికే ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కుటుంబాలను వీధిన పడేస్తుంటారు. అన్నీ తెలిసినా అలవాటు మానలేకపోతారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మద్య నిషేధానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే 20 శాతం మద్యం దుకాణాలను ఇప్పటికే మూసేసింది. తాజాగా మరో 13 దుకాణాలను క్లోజ్ చేసింది.
మరో వైపు మద్యం ధరలను కూడా భారీగా పెంచింది. దీంతో తాగేవారు తక్కువవుతారని భావించింది. అయితే పెరిగిన ధరలతో మద్యం కొనలేక, అలవాటు మానుకోలేక శానిటైజర్ తాగుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లాలో రెండు రోజుల వ్యవధిలోనే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు గోదావరి జిల్లాలో మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల్లో ఎనిమిది మంది మద్యం బదులు శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయారు.