బెజవాడలో జూలు విదిల్చిన గ్యాంగ్ వార్‌

Update: 2020-06-02 09:29 GMT

బెజవాడ అంటే ఒక్కప్పుడు గ్యాంగ్ వార్‌ కు బ్రాండ్ అనే ఇమేజ్‌ ఉంది. ఎవరి బ్యాచ్‌ లు వారివి. ఎదురుపడితే కత్తిపోట్లతో కసి తీర్చుకునే వారు. మొదట్లో అంతా ఒక్కటి అన్నట్లుగా ఉన్న ఓ రెండు కుటుంబాల మధ్య రాజుకున్న చిచ్చు బెజవాడలో కల్లోలం సృష్టించేలా చేసింది. రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు..ఆ తర్వాత రెండు కులాల అకారణ శత్రుత్వానికి దారితీసింది. బెజవాడ కొన్నేళ్ల పాటు వణికిపోయింది. ఆనాటి విధ్వంసం విజయవాడపై చెరగని గాయాన్ని మిగిల్చింది. ఇప్పుడిప్పుడే గతాన్ని మరిచిపోయి అన్ని సర్దుకుంటున్న తరుణంలో గ్యాంగ్ వార్‌ బెజవాడను ఉలిక్కిపడేలా చేసింది.

బెజవాడ శివారులోని భూమి విషయంలో వివాదం రాజుకుంది. సెటిల్మెంట్‌ లో భాగంగా ఎంటరైన రెండు గ్యాంగ్ లు కత్తులు, కర్రలతో తెగబడిపోయారు. ఈ గ్యాంగ్ వార్‌ ఒకరిని పొట్టనబెట్టుకోగా..మరొకొందరిని తీవ్ర గాయాల పాలయ్యేలా చేసింది. కానీ, ఈ గ్యాంగ్ ల వెనక ఉన్నది ఎవరు? వీళ్లని పెంచి పోషిస్తున్నది ఎవరు? ఆస్ధి తగాదాల్లోనూ కలగజేసుకునేంతగా యువకులను ఉసిగొల్పుతుంది ఎవరు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అయితే..గతంలో గ్యాంగ్ వార్‌ కు కారణమైన రెండు కుటుంబాల్లో ఓ కుటుంబం పూర్తిగా తగాదాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ప్రత్యర్ధులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసిన తమ వర్గాన్ని సయమనం పాటించేలా చూసుకుంటోంది. గతం పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్‌ కు ఊతం ఇస్తోంది ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

నగరానికి చెందిన తోట సందీప్‌, మణికంఠ అనే గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. సందీప్‌, మణికంఠ ఇద్దరూ నగరానికి చెందిన ఇద్దరు నేతలకు ప్రధాన అనుచరులుగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు నేతల ప్రొద్భలంతోనే సందీప్‌, మణికంఠ తమ గ్రూపులను బలపర్చుకొని ఆదిపధ్యం కోసం కొన్నాళ్లుగా ఘర్షణలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. రెండు గ్యాంగ్ ల లీడర్లపై కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే..పెనమలూరులోని ఓ ఆస్తి విషయంలో సందీప్‌, మణికంఠ అలియాస్‌ పండు మధ్య ఆదిపత్య పోరు రాజుకుంది. ఓ వర్గం సందీప్‌ వర్గాన్ని ఆశ్రయిస్తే...మరో వర్గం మణికంఠను ఆశ్రయించిందని..దాంతో రెండు గ్రూపుల మధ్య వివాదం రాజుకున్నట్లు చెబుతున్నారు. కానీ, ఈ గ్యాంగ్ లను పెంచి పోషిస్తున్న వారి పాత్ర ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది. తమ బాస్‌ ల అనుమతితోనే ఈ రెండు గ్యాంగ్ లీడర్లు వివాదాల్లోకి అడుగుపెడుతున్నారు. ఏదైనా సెటిల్మెంట్ డీల్ తమ దగ్గరికి వచ్చినా..తమ బాస్‌ ను సంప్రదించాకే రంగంలోకి దిగుతారు. నిన్నటి ఘటనలో కూడా తమ రాజకీయ బాస్‌ ల ఆదేశాలతోనే గ్యాంగ్ వార్‌ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే..గతంలో 2 కులాల ఆదిపత్య పోరుగా గ్యాంగ్ వార్‌ రాజుకుంటే..ఇప్పుడు రెండు సమీప కుటుంబాల ఆదిపత్య పోరులో భాగంగానే వార్‌ జరిగినట్లు తెలుస్తోంది.

విజయవాడ లీడర్లను అనుచరులను చేరదీయటం కొత్తేమి కాదు. అయితే..తమ అనుచరులను ఘర్షణలకు ఉసిగొల్పిన ఘటనలు మాత్రం ఇటీవలి కాలంలో చాలా తక్కువ. రాజకీయ సభలు, ర్యాలీల్లో తమ పరపతిని చాటుకునేందుకు మాత్రమే అనుచరులను పరిమితం చేశారు. కానీ, తాజా గ్యాంగ్ వార్‌ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా కారణమైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే నిజమైతే బెజవాడ పోలీసులు, ప్రజలు అప్రమత్తం అవక తప్పదు. లేదంటే ఇన్నాళ్లు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న బెజవాడ ఇమేజ్‌కు మరో గాయం అయ్యే ముప్పు ఉంది. ఆదిపత్యం కోసం విద్యార్ధులను పావులుగా వాడుకొని గ్యాంగ్ వార్‌ కల్చర్‌ కు మళ్లీ ఆజ్యం పోస్తున్నారు లీడర్లు. గతంలో చోటు చేసుకున్న గ్యాంగ్ వార్‌ లలో విద్యార్ధులే సమిధలుగా మారారన్నది చరిత్ర చెప్పే సాక్షం. గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకుంటే మరో రక్తచరిత్రకు ఆజ్యం పోసినట్టే అవుతుంది. బెజవాడను మళ్లీ గ్రూపుల ఘర్షణ మధ్యకు నెట్టేసే గత చరిత్ర మళ్లీ పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.

Similar News