ఇళ్ల స్థలాల కొనుగోలులో భారీగా అక్రమాలు?

Update: 2020-06-16 10:28 GMT

తూర్పు గోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. అయినవిల్లి మండలంలో ఇళ్ల స్థలాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి నదీ ప్రవాహానికి అత్యంత సమీపంలో తక్కువ ధరకు భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండుకుదురు పంచాయతీ పరిధిలోని గుణ్ణం‌మెరక, తొత్తరమూడి, శానపల్లిలంక గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించారు. అది కూడా నదీ పరివాహక ప్రాంతానికి వంద మీటర్ల లోపు. 25/1 సర్వే నంబరులోని 2 ఎకరాల 90 సెంట్ల భూమిని అధికారులు కొనుగోలు చేశారు. ఎకరా 25 లక్షలు కూడా విలువ లేని భూమిని అధికారులు 42 లక్షలు పెట్టి కొన్నారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. అదేవిధంగా నేదునూరి వారిపేట శివారులో 7 ఎకరాల భూమిని ఇళ్ళ స్థలాల కోసం సేకరించారు. ఇందులోనూ లక్షలాది రూపాయలు చేతులు మారాయని గ్రామస్థులే చెబుతున్నారు.

ఇళ్ల స్థలాల సేకరణలో అక్రమాలు జరిగినా నాయకులు పట్టించుకోవడం లేదు. పైగా, కొందరు నాయకులు, అధికారులు-దళారులతో కుమ్మక్కై అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. తక్కువ మొత్తంలో రైతుల నుంచి భూములు సేకరించి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మేసి నీకింత నాకింత అన్నట్లుగా పంచుకున్నారని చెబుతున్నారు. ఇదంతా మండల రెవెన్యూశాఖలో ఇటీవల బదిలీపై వెళ్ళిన ముఖ్య అధికారి కనుసన్నల్లో జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై గ్రామంలో గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. లక్షలాది రూపాయలు అక్రమంగా దోచేస్తుంటే అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారే గానీ స్థల యజమానులకు ఏమాత్రం న్యాయం జరగడం లేదని సమాచారం.

గుణ్ణంమెరకలో సేకరించిన స్థలం వర్షాకాలంలో వరద ముంపుకు గురవుతుంది. కోతకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ స్థలం తీసుకొంటే లబ్దిదారులకు కూడా ఇబ్బందే. ఇలాంటి భూమిని లక్షలాది రూపాయలు‌ పెట్టి ఎందుకు సేకరించారో అధికారులకే తెలియాలి. దీనిపై కొందరు నాయకులు త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం.

Similar News