తెలంగాణలో కరోనా టెస్టులకు పోటెత్తిన అనుమానితులు

Update: 2020-06-25 23:19 GMT

తెలంగాణలో కరోనా టెస్టులకు అనుమానితులు పోటెత్తుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్‌ నిర్ధారణ అవుతుండటం, పాజిటివ్‌గా రావడంతో జనంలో భయం పెరిగిపోతోంది.. దీనికి తోడు ప్రభుత్వం వారం రోజుల్లోనే 50 వేలకుపైగా పరీక్షలు చేస్తామని చెప్పడంతో అనుమానితులంతా పరీక్షల కోసం ఎగబడుతున్నారు. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే నాలుగు ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శాంపిల్స్‌ తీసుకుంటున్నారు. లక్షణాలు వున్న వారు లేని వారు అంతా టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. వేలాదిగా శాంపిల్స్‌ ఉండిపోవడంతో పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతున్నాయి.. ఫలితాలు వెల్లడించేందుకు మూడు నుంచి నాలుగు రోజుల సమయం తీసుకుంటున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.. ఐదు ల్యాబ్‌ల వద్ద కరోనా శాంపిల్స్‌ వేలాదిగా ఉండిపోయాయి.. అటు రిజల్ట్‌ ఏంటో తెలియక వైరస్‌ అనుమానితులు తీవ్ర ఆందోళనలో ఉండిపోయారు.

అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో రెండ్రోజులపాటు కరోనా టెస్టులు నిలిపివేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి ఇప్పటి వరకు 36వేల శాంపిల్స్‌ సేకరించామన్నారు. కరోనా టెస్టుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన శాంపిల్స్‌లో 8253 శాంపిల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. ఒక వ్యక్తి నుంచి కరోనా శాంపిల్‌ తీసుకుంటే దాన్ని 48 గంటల్లోగా పరీక్షించాలి. అప్పటి వరకు దానిని నిర్ణీత ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు చేసిన శాంపిల్స్‌ సేకరించడం వల్ల ల్యాబ్స్‌లో పెద్ద ఎత్తున శాంపిల్స్‌ పేరుకుపోయాయి. వాటిని నిల్వ చేయడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో టెస్టులు నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇక శాంపిల్స్‌ తీసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఉంచి పరీక్షలు జరిపితే ఫాల్స్‌ పాజిటివ్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న శాంపిల్స్‌ను పరీక్షించడం, ల్యాబ్స్‌, కలెక్షన్‌ సెంటర్లను శానిటైజ్‌ చేయడం కోసం రెండ్రోజులపాటు ప్రత్యేక శిబిరాల్లో కరోనా అనుమానితులకు పరీక్షలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రల్లో పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

Similar News