Davos : AI హబ్ గా ఏపీ: ప్రపంచ వేదికపై మంత్రి లోకేష్
AI విద్యకు ఏపీ పెద్దపీట. రూ.255 కోట్లతో 3 నూతన కేంద్రాలు. దావోస్‌లో మంత్రి లోకేష్ .;
ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum ) విద్యారంగ గవర్నర్ల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా విధానంలో నూతన ఆవిష్కరణలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా పాఠ్యాంశాలు ఉండాలని, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు పరస్పర సహకారంతో పనిచేయాలని మంత్రి లోకేష్ నొక్కి చెప్పారు.
దావోస్ ( Davos ) కుర్ పార్కు విలేజ్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి లోకేష్ తో పాటు గ్లోబిస్ యూనివర్సిటీ ఫౌండర్ యోషితో హోరి, మాంటెర్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ డేవిడ్ గార్జా, పియర్సన్ సిఇఓ ఒమర్ అబోష్, యూనవర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రెసిడెంట్ మిచైల్ స్పెన్స్, నెట్ వర్క్ ఫర్ టీచింగ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రెసిడెంట్ జీన్ డానియేల్ లారోక్, కార్నర్ స్టోన్ ఆన్ డిమాండ్ సిఇఓ హిమాన్షు పల్సులే, ఈటిఎస్ సిఇఓ అమిక్ సేవక్, ర్వాండా విద్యాశాఖ మంత్రి జోసెఫ్ సెంగిమన, యుఎఇ విద్యాశాఖ మంత్రి సారా ఆల్ అమిరి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో వస్తున్న మార్పుల కారణంగా విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, తాజా అధ్యయనాల ప్రకారం వెయ్యికి పైగా ఉద్యోగులున్న 42% సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI)ను ఉపయోగిస్తున్నాయని తెలిపారు. AI వినియోగంలో భారతదేశం (59%), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (58%), సింగపూర్ (53%) అగ్రస్థానంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
AI ప్రాముఖ్యతను గుర్తించిన యునెస్కో, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం AI కాంపిటెన్సీ ఫ్రేమ్‌వర్క్‌లను ప్రవేశపెట్టిందని మంత్రి ( Nara Lokesh ) గుర్తు చేశారు. AIతో సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం విద్యార్థులకు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం 'స్వయం' పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులను నిర్వహిస్తోందని, దీని ద్వారా వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలు కలిగిన విద్యార్థులకు ఉచిత విద్య అందుబాటులో ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. 'మేక్ AI ఫర్ ఇండియా' వంటి కార్యక్రమాలు AIలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, కార్పొరేట్ అవసరాలను తీర్చడంపై దృష్టి సారిస్తున్నాయని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో AI శిక్షణను ప్రోత్సహించడానికి, శిక్షణ పొందిన AI నిపుణులను తయారు చేయడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.255 కోట్లు కేటాయించిందని మంత్రి లోకేష్ వెల్లడించారు. 2047 నాటికి 95% నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని తయారు చేయాలనే లక్ష్యంతో STEM, AI విద్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన అన్నారు. IIT మద్రాస్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ తన విద్యార్థులను AI ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడేలా సిద్ధం చేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచడానికి, నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, డీప్ టెక్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహిస్తామని ఆయన స్పష్టం చేశారు.