Anantapur : లోన్ కమీషన్ గొడవలో ఘోరం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య

Update: 2025-09-01 08:00 GMT

లోన్ కమీషన్ విషయంలో జరిగిన ఘర్షణ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు బలిగొంది. అనంతపురం జిల్లా కదిరి తలుపుల మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లోన్లు ఇప్పించే కమీషన్ విషయంలో రేగిన వివాదంలో శ్రీకాంత్ అనే యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. తలుపులకు చెందిన అనిరుధ్ వివిధ బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించే పని చేస్తుంటాడు. ఈ క్రమంలో బలిజపేటకు చెందిన శోభా అనే మహిళకు లోన్ ఇప్పించడంలో రాజారాం అనే వ్యక్తి అనిరుధ్‌కు సహకరించాడు. ఈ లోన్‌లో తనకు కూడా కమీషన్ వాటా కావాలని రాజారాం డిమాండ్ చేశాడు. దీనిపై వివాదం జరగగా, శనివారం రాత్రి రాజారాం అనిరుధ్ ఇంటిపై దాడి చేసి అతని ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశాడు. ఆ సమయంలో అనిరుధ్, అతని కుటుంబం అనంతపురంలో ఉన్నారు.

ఈ విషయం తెలుసుకున్న అనిరుధ్, తన తండ్రి శ్రీనివాసులు, బావమరిది శ్రీకాంత్‌తో కలిసి తలుపుల తిరిగి వచ్చారు. శనివారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో రాజారాం ఇంటికి వెళ్లారు. తమపై దాడి చేస్తారని భయపడిన రాజారాం ముందుగానే సిద్ధం చేసుకున్న కత్తితో శ్రీకాంత్‌ను తొడపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో శ్రీకాంత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా, అతను మృతిచెందాడు. ఈ గొడవలో అనిరుధ్‌, అతని తండ్రి శ్రీనివాసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు రాజారాం తండ్రి వెంకటరాయప్ప, తరుణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న రాజారాం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్, తలుపుల మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న కృష్ణయ్యకు ఒక్కగానొక్క కుమారుడు. ఇటీవల శ్రీకాంత్‌కు కుమారుడు పుట్టాడు. నామకరణం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Tags:    

Similar News