Kurnool District : పొలంలో రైతుకు దొరికిన వజ్రం.. దాన్ని విలువ తెలిసి అంతా షాక్..
కర్నూలు జిల్లాలో ఓ వ్యవసాయ కూలీ పంట పండింది. తుగ్గలి మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన ఓ కూలీకి వ్యవసాయ పనులు చేస్తుండగా వజ్రం దొరికింది. మట్టి పనులు చేస్తున్న సమయంలో భూమిలో తనకు మిల మిల మెరిసిపోతున్న వజ్రం కనిపించింది. అయితే అది రాయి అనుకున్న ఆ కూలి దానిని వ్యాపారి దగ్గరకు తీసుకెళ్లి చూపించాడు. అది రాయి కాదని వజ్రం అని.. తనకు పది లక్షలకు అమ్మాలని వ్యాపారి కోరాడు. దీనికి నిరాకరించిన ఆ కూలి వజ్రాన్ని తన వద్ద ఉంచుకున్నాడు. బహిరంగ మార్కెట్లో ఈ వజ్రం విలువ 50 లక్షలు ఉంటుందని అంచనా. వజ్రం కొనుగోలు కోసం కూలీ ఇంటికి వ్యాపారులు క్యూ కట్టారు.
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలకరి జల్లులు పడగాన అక్కడి ప్రజలు వజ్రాల కోసం పొలాలను జల్లెడ పడతారు. ప్రత్యేకంగా జొన్నగిరి, తుగ్గలి, ఎర్రగుడి, పగిడిరాయి లాంటి తదితర గ్రామాల్లో వజ్రాల కోసం పరుగులు తీస్తుంటారు. ఒక వజ్రం దొరికితే చాలు లైఫ్ సెట్ అయిపోతుందని పొలాల్లో వేట కొనసాగిస్తుంటారు. ఆ ప్రాంత ప్రజలే కాదు ఇతర రాష్ట్రాల వారు సైతం ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.