Nandyal : పెద్దపులి దాడిలో యువకునికి తీవ్ర గాయాలు.. నంద్యాలలో భయం భయం...
ఏపీలోని నంద్యాలలో పెద్ద పులి స్థానికులను హడలెత్తించింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళిన ఓ యువకుడి పై దాడికి పాల్పడింది పులి. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొత్తపల్లి మండలం సదరంపెంటలో పెద్ద పులి సంచారం స్థానికులకు నిద్ర లేకుండా చేస్తుంది.
వివరాల ప్రకారం సదరంపెంటకు చెందిన పులిచెర్ల అంకన్న అనే యువకుడు రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్ళాడు. ఐతే పెద్దగా గండ్రిపులు వినపడటంతో భయంతో పొదల్లో దాక్కున్నాడు. యువకున్ని గమనించిన పులి పెద్దగా గాండ్రిస్తూ అతనిపై దాడికి దిగింది. దీంతో భయాందోళనకు గురైన యువకుడు గట్టిగా కేకలు వేశాడు. దీంతో గూడెం ప్రజలు పెద్ద ఎత్తున కేకలు వేసుకుంటూ రావడంతో అతన్ని వదిలి పెద్దపులి అడవిలోకి పారిపోయింది. పులి దాడిలో అంకన్నకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన పై విచారణ చేపట్టారు. ఈ దాడి తో స్థానిక గిరిజన గ్రామాల ప్రజలు బయటకు వెళ్లాలంటేనే వణికి పోతున్నారు. ఐతే పెద్దపులి దాడి లో గాయపడ్డ యువకుడి ప్రాణాలకు ముప్పు లేకపోవడం తో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్ళే గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.