వ్యవసాయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్ర పథకాలను సైతం గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇవాళఢిల్లీలో పర్యటించిన ఆయన.. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్రం సాయం అందించాలని కోరారు. ‘‘ఏపీలో దాదాపుగా 64 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కానీ గత వైసీపీ ప్రభుత్వం మాత్రం వ్యవసాయరంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కేంద్ర పథకాలను వినియోగించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైంది. మళ్లీ దానిని గాడిన పెట్టాలంటే కేంద్రం సహకరించాలి’’ అని అచ్చెన్నాయడు అన్నారు.