ACCIDENT: తీరని శోకాన్ని మిగిల్చిన ప్రమాదం
మాడి మసైపోయిన మృతదేహాలు.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. బెంగళూరు వెళ్తున్న టెకీ కూడా మృతి
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చింది. ఈ ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం మరణించడం విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన కుటుంబం అగ్నికి ఆహుతైంది. నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేశ్ (35) కుటుంబం బెంగళూరులో జీవనం సాగిస్తుంది. రమేశ్ ప్రొడక్ట్ సేల్స్ ఆఫీసర్ జాబ్ చేస్తున్నారు. రమేశ్‌కు భార్య అనూష (32), పిల్లలు మన్విత (6), యశ్వంత్ (8) ఉన్నారు. దీపావళి సెలవుల కోసం రమేశ్ కుటుంబం హైదరాబాద్‌లోని వారి బంధువుల ఇంటికి వచ్చింది. గత రాత్రి వీరు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. ఈ ప్రమాదంలో వీరు నలుగురు మరణించారు.
టెక్కీ మృతి
బస్సు ప్రమాద ఘటనలో ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామానికి చెందిన గన్నమనేని ధాత్రి (27) సైతం మృతి చెందారు. ధాత్రి స్వగ్రామం యద్దనపూడి మండలం పూనూరు అయితే ప్రస్తుతం ఇంకొల్లు మండలం పూసపాడులోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ధాత్రి బెంగుళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సెలవులకు ధాత్రి హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి బెంగుళూరుకు కావేరి బస్సులో బయలు దేరి ప్రమాద ఘటనలో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
లగేజీ క్యాబిన్లో మృతదేహాలు
బస్సు లగేజీ క్యాబిన్లో కూడా రెండు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంతకు ఆ మృతదేహాలు ఎవరివి..? అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పెద్ద వాదనలు బయటకు వస్తున్నాయి. ఇంతకీ క్యాబిన్లో మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి. అక్రమంగా ఓనర్‌కి తెలియకుండా దొడ్డిదారిన డబ్బులు తీసుకుని ఈ ఇద్దరు ప్రయాణికులకు క్యాబిన్లో చోటు కల్పించారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదంపై అటు యాజమాన్యం, ఇటు డ్రైవర్, క్లీనర్లు స్పందించడం లేదు. తమకేమి తెలియదంటూ ముఖం చాటేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యం ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. బంధువుల రోదనలు ఆ ప్రాంతమంతా మార్మోగింది.