AMARAVATHI: అమరావతిలో పేదలకు పింఛన్ పునరుద్ధరణ
భూమిలేని పేదలకు పింఛన్లను మళ్లీ ప్రారంభం;
రాజధాని ప్రాంతంలోని భూమిలేని పేదలకు పింఛన్లను మళ్లీ ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రద్దయిన ఈ పింఛన్లను తాజాగా టిడిపి ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని గ్రామాల్లోని 1,575 కుటుంబాలు పింఛన్‌కు అర్హులుగా గుర్తించబడ్డాయి. ఈ మేరకు 2015లో నిర్వహించిన ఇంటింటి సర్వే ఆధారంగా కుటుంబాలను ఎంపిక చేశారు. జీవనోపాధిని కోల్పోయిన వలసదారులకు ఈ పునరుద్ధరణ ఊరటనిచ్చింది. ఇటీవల జరిగిన మంత్రిమండలి భేటీలో ఈ అంశానికి ఆమోదం లభించగా, అధికార ఉత్తర్వులతో ఇక పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ఇక నూతన రాజధాని నిర్మాణ పనుల పరంగా కూడా కీలక పురోగతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నేలపాడు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్ల పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.524.70 కోట్లు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా 18 టవర్లలో 432 అపార్ట్మెంట్ యూనిట్ల నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్ణయాలు రాజధాని అభివృద్ధిలో కొత్త ప్రోత్సాహాన్నిస్తాయని స్థానికులు చెబుతున్నారు. పునరుద్ధరించిన పింఛన్లతో పాటు నిర్మాణ కార్యక్రమాల పునఃప్రారంభం అధికార యంత్రాంగం ఎక్కువ కదిలించనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.