ఏపీలో స్కిల్ సెన్సన్ ( Skill Census ) చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. నైపుణ్య గణనకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ఆదేశించింది. నిర్మాణ, ఉత్పత్తి, సేవా రంగాల్లో యువతకు ఉన్న నైపుణ్య వివరాలు సేకరించాలని సూచించింది. స్కిల్ డెవలప్‌మెంట్‌పై విధాన రూపకల్పనకు అవసరమైన సమాచారం సేకరించాలంది.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఈనెల 18న కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తర్వాతి రోజు 19న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తదితర అంశాలపై చర్చించేందుకు కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈలోపే మంత్రులకు సీఎం శాఖలను కేటాయించనున్నారు.
గురువారం సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాల అమలుపై సంతకాలు చేశారు. వాటిల్లో మొదటిది.. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ కల నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసేందుకు తొలి సంతకం చేశారు.
రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై భూ వివాదాల బాధితులు, రైతుల సమక్షంలో రెండో సంతకం పెట్టారు. సామాజిక భద్రత పింఛన్లను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేశారు. యువతలో నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు స్కిల్ సెన్సస్‌పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరిస్తూ ఐదో సంతకం చేశారు.