AP: చంద్రబాబు అనే నేనుకు...సర్వం సిద్ధం
కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధం... హాజరుకానున్న మోదీ, అమిత్ షా, చిరంజీవి, రజినీ కాంత్;
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా పలువురు మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అగ్రనటులు చిరంజీవి, రజినీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు. కూటమిలోని మూడు పార్టీల నుంచి ఎంపికైన ప్రజాప్రతినిధులు సహా నేతలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. ఈ అంశాల్నింటినీ...... దృష్టిలో ఉంచుకుని, గత నాలుగు రోజులుగా గన్నవరం మండలం కేసరపల్లిలో చేస్తున్న ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి. సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు. మొత్తం 36 గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపరించేలా భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో మూడు షెడ్లను సిద్దం చేశారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్ధం చేశారు. మిగిలిన ప్రాంతాన్ని... సాధారణ ప్రజల కోసం కేటాయించారు.
వాహనాల పార్కింగ్ కోసం సభా వేదికకు సమీపంలోని వివిధ చోట్ల 56 ఎకరాలను కేటాయించారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద రోడ్డులోని SLV సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం సభా వేదికకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి కాలినడకన సభా ప్రాంగణానికి చేరుకోవాలి. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద రెండో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు వైపు నుంచి వచ్చే వారి కోసం సభా వేదికకు 730 మీటర్ల దూరంలో మరో పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశారు. మేధా టవర్స్ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రత చర్యలు చేపట్టారు. దాదాపు 10 వేల మంది భద్రత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలో ప్రముఖులు బసచేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. కేంద్రమంత్రి అమిత్‌షా, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌చిరంజీవి సహా పలువురు వీఐపీలు.. బెజవాడ మీదుగా కార్యక్రమానికి వెళ్తున్నందున... నగరంలో 3 వేల మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు. గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7 వేల మందికి రక్షణ విధులు అప్పగించారు. కార్యక్రమంలో భద్రతపరంగా లోపాలు తలెత్తకుండా.. పకడ్బందీ నిర్వహణకు 60 మందికి పైగా IPS అధికారులను నియమించారు. డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ట్రెయినీ ఐపీఎస్‌లు కూడా వచ్చారు. వీవీఐపీల వాహన శ్రేణి నేరుగా వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లు నిర్మించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన సిబ్బంది వేదికతోపాటు, ప్రాంగణాన్ని మెటల్ డిటెక్టర్లు, జాగిలాలతో అణువణువూ జల్లెడ పట్టారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.