AP:ఏపీవ్యాప్తంగా 4,472 విలేజ్ క్లినిక్లు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఏపీ వ్యాప్తంగా 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,129 కోట్లతో సొంత భవనాలను నిర్మించ తలపెట్టింది. ఏడాది వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు అవసరమయ్యే మొత్తం ఖర్చులో 80శాతం కేంద్రమే భరిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మరో 1,379 నూతన భవనాలను రూ.753 కోట్లతో నిర్మించాల్సి ఉందన్నారు. వీటిని 16వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
ఉల్లి రైతుకు అండగా ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతును ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి క్వింటాకు రూ.1200 చొప్పున ఉల్లిని కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని అధికారులకు సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని.. ఉల్లిని ఆరబెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. వర్షాలతో ఉల్లి పంట దెబ్బ తినడం, మహారాష్ట్రలో ఉల్లి పంట ఎక్కువగా ఉన్న కారణంగా ధరల విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పది రోజుల్లో 5 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉంది. క్వింటా ఉల్లిని రూ.1200 చొప్పున కొనుగోలు చేయండి. తక్షణం కొనుగోళ్లు ప్రారంభించాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలి. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలి. ఉల్లికి రేటు వచ్చేంత వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలి. ఉల్లి రైతు నష్టపోకూడదు, వినియోగదారుడు ఇబ్బంది పడకూడదు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి’ అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు సీఎం సూచనలు చేశారు.