AP : పోలవరంపై క్లారిటీ.. కొత్త డయాఫ్రం వాల్ అవసరం లేదట
దెబ్బతిన్న వాల్‌పై ఏం చేయాలో ఇవాళ జరగనున్న డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సమావేశంలో నిపుణులు, సీడబ్ల్యుసీ అధికారులు ఓ నిర్ణయాలు తీసుకోనున్నారు.;
ఆంధ్రుల జీవనాడి పోలవరం డయాఫ్రమ్ వాల్ సామర్థ్యంపై ఓ క్లారిటీ వచ్చింది..ఈ ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణ పనులు చేపట్టేందుకు ఈ నివేదిక కీలకం కానుంది.డయాఫ్రం వాల్ బాగానే ఉందని, అక్కడక్కడ కొద్దిగా దెబ్బతిందని నిపుణుల పరీక్షల్లో తేలినట్లు సమాచారం. కొత్త డయాఫ్రం వాల్ నిర్మించే అవసరం రాకపోవచ్చన్న అభిప్రాయాలు వస్తున్నాయి. దెబ్బతిన్న వాల్‌పై ఏం చేయాలో ఇవాళ జరగనున్న డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సమావేశంలో నిపుణులు, సీడబ్ల్యుసీ అధికారులు ఓ నిర్ణయాలు తీసుకోనున్నారు.
పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ ది కీ రోల్.రాతి,మట్టి డ్యాం నిర్మాణంలో ఇది ముఖ్యం. గోదావరిలో నీటి ఊట నియంత్రణకు అడ్డుగా నిలుస్తుంది. ఈ వాల్‌ను విదేశీ పరిజ్ఞానంతో ఎల్‌అండ్‌టీ, బావర్ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. అయితే భారీ వరదల్లో ఈ వాల్ కొంత ధ్వంసమైంది. మొత్తం ఒక వేయి 396 మీటర్ల పొడవునా గ్యాప్-2లో ప్లాస్టిక్ డయాఫ్రం వాల్ నిర్మించారు. 93.50 మీటర్ల లోతు నుంచి కూడా ఈ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం గోదావరి డయాఫ్రం వాల్ కోత పడినచోట నీరు ఉండటంతో ఎన్‌హెచ్‌పీసీ పరీక్షలు చేయడానికి వీలు పడలేదు. ఈ నేపధ్యంలో 900 మీటర్ల ప్రాంతంలో నాలుగైదు చోట్ల కొంతమేర డయాఫ్రం వాల్ దెబ్బతిందని పరిశోధన సంస్థ తేల్చి నివేదిక సమర్పించింది. కొన్ని ప్యాచ్ పనులతోనే దీన్ని సరిదిద్దవచ్చని ఎక్సపర్ట్ కమిటీ అభిప్రాయాలు వ్యక్తం చేసింది.
మరోవైపు డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ ఛైర్మన్ పాండ్యాతో పాటు నిపుణుల బృందం సందర్శించింది. డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడే ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు ఆ నివేదికలోని అంశాలపై ఇతర నిపుణులతోనూ చర్చించారు. ఇవాళ రాజమండ్రిలో నిర్వహించే సమావేశంలో ఈ నివేదిక ప్రజంటేషన్ ఇచ్చి చర్చించనున్నారు. సరిగ్గా ఎక్కడ, ఎంత లోతున దెబ్బతిందో ఈ సమావేశంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పోలవరం రీయింబర్స్ నిధులు 2 వేల600 కోట్ల వరకు ఇంకా కేంద్రం నుంచి రాలేదని,ఆ నిధులు పోలవరం నిర్మాణానికి చాలా ముఖ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.