AP: ఏపీ చరిత్రను మలుపుతిప్పే భారీ ఒప్పందం
నేడు ఢిల్లీలో గూగుల్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం.. మారనున్న ఆంధ్రప్రదేశ్, విశాఖ రూపురేఖలు.. ఏపీ చరిత్రలో మైలురాయిగా ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక రంగాల భవిష్యత్తును మార్చే దిశగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, విశాఖపట్నంలో సుమారు 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.87,250 కోట్లు) భారీ పెట్టుబడితో ‘గూగుల్ ఏఐ హబ్’ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవబోతున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ ప్రతినిధుల మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరగనుంది. ఈ ఒప్పందంతో విశాఖపట్నం దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) నగరంగా రూపాంతరం చెందనుంది. గత ఏడాది అక్టోబర్ 31న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. శాన్ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్‌తో జరిపిన చర్చలలో ఏపీలో ప్రపంచస్థాయి ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై ప్రతిపాదన చేశారు.
చంద్రబాబు, లోకేశ్ కృషితో...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్రాండ్ ఇమేజ్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిరంతర కృషితో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఇది ఎపి చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. భారత ఎఐ శక్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయుపై న్యూ ఢిల్లీలో సంతకాలు చేయనున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ)గా రికార్డు సృష్టించబోతోంది. న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్ లో మంగళవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, నారా లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయుపై సంతకాలు చేయనున్నారు.
లోకేష్ అమెరికా పర్యటనతో...
రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31వతేదీన శాన్ ఫ్రాన్సిస్కో లో గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎఐ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఆ తరువాత గూగుల్ ప్రతినిధులతో పలుదఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ పూర్తి AI సాంకేతిక వేదికను ఆతిథ్యం ఇవ్వగల అవకాశం లభిస్తుంది. దీని ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక నాయకత్వం వహించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ సంస్థ రాబోయే అయిదేళ్లలో సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. 2028-2032 మధ్య కాలంలో ఏటా సగటున రూ.10,518 కోట్లను రాష్ట్ర జీఎస్డీపీకి చేర్చనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1,88,220 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. అంతేకాకుండా, గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. మొత్తం ఐదేళ్లలో దాదాపు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం లభించింది. ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు సింగిల్ విండో క్లియరెన్స్, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.