AP: సాంస్కృతిక వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రతీక
కొనియాడిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్... తిరుపతిలో మహిళా సాధికార జాతీయ సదస్సు... మహిళలే సమాజ అర్కిటెక్ట్లు: గవర్నర్
సాంస్కృతిక వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ ఓ ప్రతీక అని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. తిరుపతి వేదికగా ‘మహిళా సాధికార జాతీయ సదస్సు’ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాభాయ్ దేశ్ముఖ్ సేవలను హరివంశ్ కొనియాడారు. తరచూ మహిళా సాధికార సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు నిర్వహించామన్నారు. మహిళల సమస్యలే కాదు వాటికి పరిష్కార మార్గాలను సూచించారని చెప్పారు.
మహిళలే సరైన ఆర్కిటెక్ట్లు
మహిళా సాధికారత కేవలం మహిళలనే కాదు.. సమాజాన్నీ వృద్ధి పథంలో నడిపిస్తుందని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు రెండోరోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సతీ సహగమనం, బాల్య వివాహాలు పురాణాల్లో కనిపించవని చెప్పారు. మన వేదాలు, ఉపనిషత్తులు మహిళలను గౌరవించాలని చెబుతున్నాయన్నారు. వారికి గౌరవం లేని చోట ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. మహిళలు ఎన్నో సవాళ్లను దాటి రాజకీయ, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురుషులకు గట్టి పోటీ ఇస్తున్నారు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వారి హక్కులను కాపాడేలా తీర్పులు ఇచ్చింది. ఆయా తీర్పులు హక్కులను కాపాడటంలోనే కాదు, సమాజ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించాయి. ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 14 శాతం మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. రువాండాలో 30 శాతం పార్లమెంటరీ సీట్లు కేటాయిస్తూ చట్టం చేసిన కొద్ది కాలానికే అక్కడ వృద్ధి పెరిగింది. ’’ అని గవర్నర్ అన్నారు.