AP: ఆత్మనిర్భర్ భారత్‌కు ఆంధ్రప్రదేశ్ కీలకం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు.. ఏపీకి పటిష్ట నాయకత్వం ఉందన్న ప్రధాని.. రాష్ట్రంలో అనంతమైన అవకాశాలున్నాయ్
ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ‘‘సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉంది. అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడికి నమస్కరిస్తున్నా. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నా. జ్యోతిర్లింగం సోమనాథుడి నేల అయిన గుజరాత్లో నేను జన్మించాను. విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించింది. చంద్రబాబు, పవన్ రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది. 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్రం అపూర్వ ప్రగతి సాధిస్తోంది. దిల్లీ, అమరావతి వేగంగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. 2047 నాటికి మన దేశం.. వికసిత్ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం.. 140 కోట్ల భారతీయుల శతాబ్దం’’ అని మోదీ అన్నారు.
వికసిత్ భారత్ దిశగా...
శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు గ్యాస్ పైప్‌లైన్.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టాం అన్నారు ప్రధాని మోడీ… 2047 వికసిత్ భారత్ సంకల్పానికి స్వర్ణాంధ్ర ఎంతో సహకరిస్తోంది.. రెండ్రోజుల క్రితం ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రకటించింది.. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ అంతర్జాతీయ కేబుల్ హబ్‌గా మారబోతోంది.. దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి అవసరం.. అలాగే ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అవసరం అన్నారు.. నిమ్మలూరు నైట్ విజన్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం. కర్నూల్‌ను డ్రోన్ హబ్‌గా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం అని తెలిపారు.. ఆపరేషన్ సిందూర్‌లో మన డ్రోన్లు అద్భుతాలు సృష్టించాయన్నారు.. దేశంలో రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను లేకుండా చేశాం.. జీఎస్టీ భారం తగ్గించాం అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాన్ని విస్మరించాయి. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారుతోంది’’ అని ప్రధాని అన్నారు.
శ్రీశైల మల్లన్న సేవలో నరేంద్రుడు
ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రానికి చేరుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలలో రుద్రాభిషేకం చేశారు. భ్రమరాంబాదేవికి ఖడ్గమాల సమర్పించారు. కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. మల్లికార్జునస్వామి ఆలయంలో మోడీ రుద్రాభిషేకం చేయగా, భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజ చేశారు. ప్రధానితో పాటు కర్నూలు నుండి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడగా అక్కడ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు.