AP: ఏపీలోని దేవాలయాలకు ఛైర్మన్ల నియామకం
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం మల్లన్న ఆలయ ఛైర్మన్గా రమేష్ నాయుడు, వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్గా వెంకట్రాజు, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఛైర్మన్గా సురేంద్రబాబు, శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్గా కొట్టె సాయిప్రసాద్, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్గా రాధాకృష్ణ నియమితులయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం పదవుల భర్తీ వేగంగా చేపడుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడగా.. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ ఏపీ ప్రభుత్వ అత్యున్నత పదవుల నుంచి క్షేత్రస్థాయి పదవుల వరకు అన్నింటిని చకాచకా భర్తీ చేస్తోంది. పార్టీ కోసం కష్టపడిన నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. గత బ్రహ్మోత్సవాల్లో లోపాలను గుర్తించి ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేప్టటామని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగు నీరు వంటివి పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు నిరంతరం అన్నప్రసాదాలు, తాగు నీరు వంటివి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గరుడ సేవ రోజు తిరుమల కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించామని, తిరుమల వచ్చే భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా రావాలని కోరారు. 5 ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 4 వేల సీసీ కెమెరాల ద్వారా బ్రహ్మోత్సవాలను పర్యవేక్షిస్తామన్నారు.