AP ASSEMBLY: సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశం
సెప్టెంబర్ 18 నుంచి 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్నీ గత నెలలలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన, తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నారు. తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. . దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు సీఎం చంద్రబాబు, లోక్సభ స్పీకర్ హాజరవుతారని, ముగింపు రోజున గవర్నర్ హాజరుకానున్నారని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు శ్రీవారి దర్శనం కల్పించించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు 18 నుంచి శాసనసభ సమావేశాలు జరగుతాయని, ఎమ్మెల్యేలకు సమాచారం పంపించినట్టు పేర్కొన్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ అధినేత జగన్ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానట్లు తెలుస్తోంది.
35 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్
ఇటీవల జరిగిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు..35 మంది ఎమ్మెల్యేలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోనే సమస్య వస్తోందని, పాతవాళ్లు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని, గట్టిగా వార్నింగ్ ఇచ్చానని చెప్పారు. మార్పు రాకపోతే, కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నా ఎమ్మెల్యేల తీరుతో వ్యతిరేకత రావడం టీడీపీను ఆందోళన పరుస్తోంది. వ్యతిరేకతకు కారణాలను తెలుగుదేశం అధిష్టానం తెలుసుకుంటోంది. ఏడాది పాలనలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో టీడీపీ అంతర్మథనంలో పడిందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.