AP: ఏపీ శాసనమండలిలో గందరగోళం

వైసీపీ నేతల్లో నైరాశ్యం

Update: 2025-09-19 06:11 GMT

ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై వెంటనే చర్చలు చేపట్టాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అయితే, వైసీపీ తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. వైసీపీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. సభ మొత్తం రచ్చరచ్చగా మారింది. మండలిని చైర్మన్ వాయిదా వేశారు. 

మాజీ మంత్రులు హౌస్ అరెస్ట్

పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ‘చలో మెడికల్ కాలేజీలు’ నినాదంతో ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజనిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే, మాజీ మంత్రి వేణు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి, వైసీపీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, భార్గవ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. 

శాసనసభలో బీజేపీ నేత చమత్కారాలు

శాసనసభలో జీఎటీ సంస్కరణలపై చర్చ సందర్భంగా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు తమ చమత్కారాలతో సభను ఉల్లాసంగా మార్చారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ కుట్ర చేశారని వ్యాఖ్యానించగా, సభ్యులు ఆశ్చర్యపోయారు. అనంతరం “టీడీపీ గుర్తు సైకిల్‌పై పన్ను 12% నుంచి 5%కి తగ్గింది, సైకిల్‌పై ప్రేమతోనా? ” అని సరదాగా ప్రశ్నించడంతో సభలో నవ్వులు పూసాయి.

వైసీపీ నేతల్లో నైరాశ్యం

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తీరు మారడంలేదు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. ఆయన మాత్రం వరుసగా బెంగళూరు ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నెల 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. నేడు మరోసారి బెంగుళూరు వెళ్తున్నారు. దీంతో వైసీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోయినా.. కనీసం తాడేపల్లిలో ఉండి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తే బాగుండేదని సొంత నేతలే పెదవి విరుస్తున్నారు.

Tags:    

Similar News