AP CID: తెలుగు మీడియాను దూరం పెట్టి...
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ ప్రెస్ మీట్.... ఎందుకు అనుమతించరని ప్రశ్నించినా స్పందన కరువు...;
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నా ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్‌లలో ప్రెస్‌మీట్లు పెట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసిన సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.... దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ ప్రెస్‌మీట్‌కు తెలుగు మీడియాను దూరం పెట్టారు.
ఫైవ్‌స్టార్ హోటల్ అశోకాలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి తాము ఎంపిక చేసుకున్న ఇంగ్లీషు, హిందీ పత్రికలు, టీవీలకు సమాచారం అందజేశారు. ఎంచుకున్న జాతీయ మీడియా ప్రతినిధులను మాత్రమే సమావేశానికి అనుమతించారు. ప్రెస్‌మీట్ విషయం తెలిసిన ఢిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా తెలుగ మీడియాను పిలవలేదని ఎందుకు వచ్చారంటూ అక్కడున్న సీఐడీ అధికారులు, ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖల సిబ్బంది అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజాధనంతో పెట్టే ప్రెస్‌మీట్‌కు తెలుగు మీడియాను ఎందుకు రానివ్వరని మీడియా ప్రతినిధులు నిలదీయడంతో తమకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయని, తామేమీ చేయలేమని వారు చేతులెత్తేశారు. ఎక్కడినుంచి ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించగా నోరు మెదపలేదు. విలేకరుల సమావేశానికి సంబంధించి గది ముందు ఏర్పాటుచేసిన బోర్డును అక్కడినుంచి తీసేశారు. ఆహ్వానం అందని ఇతర ఇంగ్లీషు, హిందీ పత్రికలు, టీవీ మాధ్యమాల విలేకర్లనూ లోపలికి అనుమతించలేదు.
ఈ సమావేశానికి కొంత ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ఇక్కడికి వచ్చారు. సీనియర్ జర్నలిస్టుతో పాటు జర్నలిస్టు సంఘం నాయకుడైన మీరే తెలుగు మీడియాకు అనుమతి ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించగా సమాధానం దాటవేస్తూ ప్రెస్‌మీట్ గదిలోకి వెళ్లిపోయారు. తర్వాత సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వచ్చారు. తాము ఎందుకు సమావేశానికి రాకూడదని తెలుగు మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నా సమాధానం ఇవ్వకుండానే వారు లోనికి వెళ్లిపోయారు. తెలుగు మీడియాకు ప్రవేశం లేదని చెప్పిన అధికారులు సాక్షి టీవీ ప్రతినిధిని మాత్రం అనుమతించారు. దీనిపై ప్రశ్నించినా సీఐడీ, ప్రభుత్వ అధికారులు నోరు మెదపలేదు.
క్రియాశీలకంగా ఉండే మలయాళీ మీడియా ప్రతినిధులు లోతైన ప్రశ్నలు వేస్తారనే భయంతోనే వారిని దూరంగా పెట్టినట్లు భావిస్తున్నారు. ఏపీ భవన్‌లో ఉచితంగా విలేకరుల సమావేశం పెట్టుకునే అవకాశమున్నప్పటికీ భారీగా ఖర్చయ్యే ఫైవ్‌స్టార్ హోటల్లో ఏర్పాటు చేశారు. సమావేశంలో జాతీయ మీడియా ప్రతినిధులు తెలుగు విలేకరులని ఎందుకు పిలవలేదని ప్రశ్నించగా వారికి విజయవాడ, హైదరాబాద్‌లో ఇప్పటికే కేసు గురించి వివరించామని అమర్ సమాధానం ఇచ్చారు.
అజేయ కల్లం, ప్రేమచంద్రారెడ్డిలను ఎందుకు అరెస్టు చేయలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అజేయకల్లం నాడు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారని తెలిపారు. ప్రేమచంద్రారెడ్డి తన బాస్‌గా ఉన్న ముఖ్యమంత్రి ఎక్స్‌అఫీషియో చీఫ్ సెక్రటరీ ఘంటా సుబ్బారావు మార్గదర్శకత్వంలో పని చేశారని తెలిపారు. రాజకీయ ఒత్తిడితోనే చంద్రబాబును అరెస్టు చేశారా అని విలేకరులు ప్రశ్నించగా తాము తొలుత ఇది కార్పొరేట్ అంశం అనుకున్నామని, చివరకు రాజకీయ కోణం తేలిందని వివరించారు.