AP: అశ్రు నయనాల మధ్య నారా రామ్మూర్తి అంత్యక్రియలు పూర్తి

కన్నీటి పర్యంతమైన చంద్రబాబు... పాడె మోసిన చంద్రబాబు, లోకేశ్;

Update: 2024-11-18 01:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు.. తిరుపతి జిల్లా నారావారిపల్లి లో అధికార లాంఛనాలతో ముగిశాయి. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య నారా రామ్మూర్తి నాయుడుకు తుది వీడ్కోలు పలికారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ దంపతులు, నారా, నందమూరి కుటుంబాలకు చెందిన వారు పాల్గొని రామ్మూర్తికి తుది వీడ్కోలు పలికారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు.

విమానంలో స్వగ్రామానికి..

హైదరాబాద్ ఆస్పత్రిలో మరణించిన నారా రామ్మూర్తినాయుడి భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం మంత్రి నారా లోకేశ్‌, రామ్మూర్తి నాయుడు తనయులు నారా రోహిత్‌, నారా గిరీష్‌ విమానంలో తిరుపతికి తీసుకొచ్చారు. తర్వాత సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌ మరో విమానంలో వచ్చారు. వీరితోపాటు చంద్రబాబు సోదరి హైమావతి సహా బంధువులు రామ్మూర్తి నాయుడి పార్ధివదేహంపై పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.


పాడెమోసిన చంద్రబాబు, లోకేశ్

స్వగ్రామం నారావారి పల్లిలోని ఇంటి నుంచి అంతిమయాత్ర మొదలు కాగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ పాడె మోశారు. చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల సమీపంలోనే అధికార లాంఛనాల నడుమ అంత్యక్రియలు జరిగాయి. గౌరవసూచకంగా తొమ్మిది మంది ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. నారా రోహిత్‌, నారా గిరీష్‌ తండ్రి చితికి నిప్పంటించారు. కాగా, అంత్యక్రియలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై రామ్మూర్తినాయుడికి నివాళులు అర్పించారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, హీరోలు నాగశౌర్య, రాజేంద్రప్రసాద్‌, మోహన్‌బాబు, మంచు మనోజ్‌, నిర్మాత ఎన్‌వీ ప్రసాద్‌, మాజీ మంత్రులు అమరనాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు రామ్మూర్తి నాయుడి భౌతికకాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణమాదిగ స్వయంగా డప్పు కొట్టి నివాళులర్పించారు.

చంద్రబాబు కన్నీటిపర్యంతం

సోదరుడి అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ విషణ్ణ వదనాలతో కనిపించారు. నారావారిపల్లిలో స్వగృహానికి వచ్చింది మొదలు అంత్యక్రియలు ముగిసి తిరిగి ఇంటికి చేరేవరకు వారు మౌనంగానే ఉన్నారు. పార్ధివ దేహం వద్ద పినతండ్రి తనయులు రోహిత్‌, గిరీష్‌ విలపిస్తుండగా లోకేశ్‌ వారి పక్కనే కూర్చుని అనునయించారు. తమ్ముడి పార్థివదేహాన్ని అంతిమయాత్రకు కదలించినపుడు, అంత్యక్రియల సందర్భంలోనూ చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు.

Tags:    

Similar News