CBN: గోదావరి-కావేరితో లాభం లేదు: చంద్రబాబు

జనవరి 2 నుంచి పోలవరం పనులు ఆరంభం.. పాలనలో వేగం పెంచుతామన్న చంద్రబాబు;

Update: 2024-12-31 02:30 GMT

కేంద్రం ప్రతిపాదించిన గోదావరి-కావేరి అనుసంధాన పథకం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రయోజనం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నదులను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేయవచ్చని చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో రిజర్వాయర్ల సామర్థ్యం 983 టీఎంసీలకు చేరిందన్న ఆయన... ప్రస్తుతం వాటిలో 729 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు. జనవరి ఒకటో తేదీకి రిజర్వాయర్లలో 74 శాతం నీళ్లు ఉండడం రికార్డని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు.

పోలవరం పనులు అప్పుడే..

పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ పనులు జనవరి రెండో తేదీన ప్రారంభమవుతాయని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు క్షేత్రంలో చేపట్టే ఈ కార్యక్రమంలో తానూ పాల్గొంటానని వెల్లడించారు.

వేగం పెంచుతాం

కొత్త సంవత్సరం నుంచి పాలనలో గేరు మార్చబోతున్నామని, వేగం పెంచుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ వేగానికి తగట్లుగా అధికారులంతా పని చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరించి, వారు తమ పనితీరు మెరుగు పరచుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ పాలన కొనసాగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారులు తమ పనితీరుతో ప్రజల్ని మెప్పించాలన్నారు. అప్పుడే జనరంజక పాలన సాకారమవుతుందని తెలిపారు.

ప్రజాభిప్రాయ సేకరణ

ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ బస్టాండ్లు, దేవాలయాలు, ఆస్పత్రుల్లో క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసి ప్రజలకు అందుతున్న సేవలపై అభిప్రాయాలు సేకరించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పింఛన్ల పంపిణీని జీపీఎస్‌ ద్వారా తెలుసుకోవాలన్నారు. మద్యం బెల్టుషాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఇకపై ప్రతి సోమవారం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌పై సమీక్ష ఉంటుందని తెలిపారు. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్‌ల్లో సీసీ కెమేరాలు, వాహనాలకు జీపీఎస్‌ ద్వారా పర్యవేక్షణ జరగాలి. ఎప్పటికప్పుడు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్‌లో ఒక్క ఆరోగ్య రంగానికే రూ.18 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

Tags:    

Similar News