CBN: ప్రజల ఆదాయం పెంచుతాం

2047 నాటికి రూ.347 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఏపీ... వెల్లడించిన సీఎం చంద్రబాబు;

Update: 2025-01-17 01:30 GMT

సంపద సృష్టిస్తాం.. ప్రజల ఆదాయం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. "అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చా. పవర్‌ సెక్టార్‌లో సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చాం’ అని వెల్లడించారు. ఏపీ వృద్ధిరేటుపై సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024-25 సంవత్సరపు జీఎస్‌డీపీ మొదటి ముందస్తు అంచనాల్ని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. దేశంలో జనాభా తగ్గుతోందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో.. జనాభాలో డేంజర్ జోన్‌లో ఉందన్నారు. అందుకే, సంపదతో పాటు జనాభా సృష్టి కూడా జరగాలని అభిప్రాయపడ్డారు. అన్నిటికంటే అభివృద్ధి అనేది చాలా కీలకమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు, వ్యక్తిగత ఆదాయం పెరగాలన్నారు. ప్రజలకు తన మాటలు అర్థం కాకపోయినా వారి జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న అంశమని చెప్పుకొచ్చారు.

నాలుగున్నర రెట్లు పెరుగుతుంది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృద్ధిరేటు రెండింతలు పెరిగితే సంపద నాలుగున్నర రెట్లు పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం 15శాతం వృద్ధిరేటు సాధించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.347 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం రూ.58,14,916 కు పెంచడమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నామని వివరించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య రాష్ట్ర స్థూలోత్పత్తి వృద్ధి రేటు 13.5% ఉంటే... వైసీపీ ప్రభుత్వ అసమర్థ, అస్తవ్యస్త పాలన వల్ల 2019-24 మధ్య 10.32%కు పడిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడు నెలల్లో మళ్లీ వ్యవస్థలన్నీ గాడిన పడుతున్నాయని... 2024-25లో జీఎస్‌డీపీ వృద్ధిరేటు 12.94% ఉందని ఆయన పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర-2047 దార్శనికపత్రంలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు రాష్ట్ర ఆర్థికవ్యవస్థ 2.4 ట్రిలియన్‌ డాలర్లకు, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 42వేల డాలర్లకు చేరాలంటే... జీఎస్‌డీపీలో ఏటా 15% వృద్ధి సాధించాలని ఆయన తెలిపారు.

కుంటుపడిన ప్రగతి

వైసీపీ ప్రభుత్వ పాలనలో గత ఐదేళ్లలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల ప్రగతి కుంటుపడిందని చంద్రబాబు చెప్పారు. ‘2014-19లో వ్యవసాయ రంగంలో 16.6శాతం వృద్ధి రేటు నమోదవగా, 2019-24లో అది 10.22 శాతానికి పడిపోయిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఈ రంగంలో 15.86శాతం వృద్ధిరేటు సాధించామని తెలిపారు. 2014-19లో పారిశ్రామిక రంగం 11.9 వృద్ధిరేటు సాధించిందని.... 2019-24లో ఇది 11.33శాతానికి తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7శాతంగా ఉందన్నారు. 2014-19లో సేవారంగంలో 11.9శాతం వృద్ధి నమోదైందన్న చంద్రబాబు.. 2019-24లో ఇది 10.84 శాతానికి క్షీణించిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో 11.7 శాతం వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. 2014-19లో 13.5 శాతంగా నమోదైన వృద్ధిరేటు 2019-24లో 10.32 శాతానికి తగ్గింది. ప్రస్తుతం 12.94 శాతానికి చేరుకుంది. 2014-19లో జాతీయ సగటు వృద్ధిరేటు 10.98 శాతం కంటే ఏపీలో అధికంగా 13.5 వృద్ది రేటు నమోదైందని సీఎం తెలిపారు.

Tags:    

Similar News