CBN: ఆ అధికారుల ముఖం కూడా చూడని చంద్రబాబు

వైసీపీ అంటకాగిన అధికారులను దూరం పెడుతున్న చంద్రబాబు... కలవడానికి నిరాకరణ;

Update: 2024-06-07 01:00 GMT

సివిల్ సర్వీస్ ఉద్యోగులమన్న విచక్షణ కూడా మరిచి గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటకాగిన ఉన్నతాధికారుల పట్ల తన వైఖరి ఏంటో చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి సస్పెన్షన్‌కు గురైన వారి ముఖం కూడా చూసేది లేదని కనీసం వారిని తన ఇంటి కాంపౌడ్‌లోకి కూడా రాని‌వ్వడంలేదు. తమ తప్పేమీలేదని అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే నడుచుకున్నామని తెలుగుదేశం నేతలతో రాయబారాలు సాగిస్తూ ఆయన్ను కలిసేందుకు యత్నించిన నేతలను గేట్‌ బయట నుంచే వెనక్కి పంపుతున్నారు. ఏపీలోని.. 40 మంది సలహాదారులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సాధారణ పరిపాలనశాఖ మంత్రుల పేషీల్లోని PSలు, OSDలను మాతృశాఖకు పంపుతూ ఆదేశాలు జారీచేసింది.


గత ప్రభుత్వంలో కలంకిత అధికారులుగా పేరు తెచ్చుకున్న వారి పట్ల... తమ వైఖరి ఎలా ఉండబోతోందో ఈనెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. అలాంటి అధికారులను కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే నేరుగా చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన.... సీనియర్ IPS అధికారి PSR ఆంజనేయులను గేటువద్దే కానిస్టేబుళ్లు ఆపేశారు. లోపలికి అనుమతి లేదంటూ..వెనక్కి తిప్పి పంపివేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ డీజీగా పనిచేసిన ఆంజనేయలు తొలి నుంచీ వైసీపీ నేతలకు అనుకూలంగానే వ్యవహరించారు. ఎన్నికల్లోనూ..ఆయన వ్యవహార శైలి మారకపోవడం వల్ల..ఈసీ కొరడా ఝళిపించింది.తర్వాత ఆయన అనధికారికంగా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు చంద్రబాబును కలిసి తన తప్పేమిలేదని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి వచ్చినట్లు తెలిసింది. అలాంటి అధికారులను దరిచేరనిచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది.

మరో సీనియర్ IPS అధికారి, సీఐడీ చీఫ్‌ సంజయ్‌ సైతం ముందస్తు అనుమతి లేకుండానే చంద్రబాబు నివాసానికి చేరుకోగా కరకట్ట గేటు వద్దే కారుని ఆపిన కానిస్టేబుళ్లు వెనక్కి తిప్పి పంపేశారు. పైగా ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందంటూ సంజయ్ కారుని కానిస్టేబుళ్లు బలవంతంగా వెనక్కి పంపేశారు. చంద్రబాబుపై అక్రమ కేసుల నమోదులో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల ఫలితాలు రాగానే సెలవు పెట్టి విదేశాలకు వెళ్లేందుకు సంజయ్‌ ప్రయత్నించగా.. ఆయన సెలవు రద్దు చేశారు.మరో సీనియర్ IPS అధికారి కొల్లి రఘురామిరెడ్డికి సైతం చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి దక్కలేదు. మర్యాదపూర్వక భేటీ పేరిట చంద్రబాబును కలిసేందుకు యత్నించగా నుమతి లేదని నేతలు తేల్చిచెప్పారు.


నంద్యాలలో చంద్రబాబు అరెస్టు సమయంలో కొల్లి రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల్లో వైసీపీకు విధేయుడుగా ఉన్నారని కొల్లి రాఘురామిరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది. గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిని కూడా అనుమతి లేదని వెనక్కి పంపారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లారు.ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ పైనుంచి వచ్చిన ఆదేశాలతో జవహర్‌రెడ్డి సెలవుపెట్టి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు జవహర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్ అనారోగ్య కారణాలతో సెలవుపెట్టి వెళ్లారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన సలహాదారులందరినీ తక్షణం పదవుల నుంచి తప్పించాలని ఆదేశాలు వచ్చాయి.

అటు ఏపీ ఫైబర్ నెట్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల భద్రత పెంచారు. కీలక దస్త్రాలను ధ్వంసం చేస్తారన్న నిఘా వర్గాల సమాచారం ఆధారంగా అదనపు భద్రత ఏర్పాటుచేశారు ముఖ్యమైన దస్త్రాలు, డేటా ఎవరూ తీసుకెళ్లకుండా సచివాలయం 3, 4 అంతస్తుల్లో 24గంటల నిఘా పెట్టారు. కార్యాలయం లోపలికి, బయటకు వెళ్లే సిబ్బందిని పోలీసులు ప్రతిసారి తనిఖీ చేస్తున్నారు. బయటివారు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. విజయవాడ సౌత్‌జోన్‌ ఏసీపీ రతన్‌రాజు, సైబర్ క్రైమ్ ఎసీపీ తేజేశ్వర రావు APFSLలోని ఫైనాన్స్, పరిపాలన శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఫైబర్ నెట్ కార్యాలయం నుంచి దస్త్రాలు బయటకు వెళ్లేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ఫైల్స్, డేటాను తొలగించవద్దని ఆదేశించారు. అన్ని ఫైళ్లు భద్రపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News