CBN: ఎక్కడున్నా తెలుగువారంతా ఒకటే

ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభించిన చంద్రబాబు... తెలుగును పరిపుష్టం చేయాలని పిలుపు;

Update: 2025-01-04 03:00 GMT

అనంతపురం నుంచి ఆదిలాబాద్‌ వరకు..శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటే అని.... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలను చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాలెడ్జ్‌ ఎకానమీలో తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని చంద్రబాబు అన్నారు. ఏఐ, డీప్‌ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలని పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్‌ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.

ప్రపంచం నలుమూలల నుంచి...

తెలంగాణ, ఏపీ, ఆస్ట్రేలియా, అమెరికా.. ప్రపంచ నలుమూలల నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలకు వచ్చారని చంద్రబాబు అన్నారు. తన జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన రోజని అన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు. ఏపీ, తెలంగాణలో ఉండే తెలుగువారికంటే భాష, సంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే అని చంద్రబాబు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలి..

దేశ విదేశాల్లో తెలుగువారు గొప్పగా రాణిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. తెలుగువారు ఎక్కడున్నా పరస్పరం సహకరించుకోవాలన్నారు. ఐక్యంగా ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. ఏ ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయో తెలుగువారికి బాగా తెలుసని చంద్రబాబు వెల్లడించారు. విజన్‌ 2047తో ముందుకెళ్తున్నాం. 2047 నాటికి మనం ప్రపంచంలోనే మొదటి, రెండో స్థానంలో ఉంటాం. చిన్న ఆలోచనతో అనేక మంది తెలుగువారు కోటీశ్వరులు అయ్యారు. చిన్న ఆలోచనతో ర్యాపిడోను స్థాపించి గొప్పగా రాణించారన్నారు.

తెలుగును కాపాడుకుందాం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని సంఘటిత పరిచి... తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపుష్టం చేయాలని చంద్రబాబు సూచించారు. వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు, సినీ నటులు, విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. 5వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరు అవుతారని సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్‌ తెలిపారు.

Tags:    

Similar News