AP: సోమవారం..పోలవరానికి చంద్రబాబు
జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ... సీఎం పోలవరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలపై ఆరా;
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాచరణ ప్రారంభించిన చంద్రబాబు.. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమైన సీఎం పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు సిద్దమవుతోన్న చంద్రబాబు గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారు.సమయపాలన కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్న ఆయన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివలయంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నిరంతరం సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు కూడా.. చంద్రబాబు సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని పరిపాలన పరంగా పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పోలవరం పర్యటన పూర్తయ్యాక శాసనసభ సమావేశాలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
శాఖల కేటాయింపు పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలోని మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తైంది. ఈ మేరకు ము ముఖ్యమంత్రి చంద్రబాబు.. 24మంది మంత్రులకు శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి అంతా ఊహించినట్లుగానే జనసేనాని పవన్‌కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ హోదాలో ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో నారా లోకేష్ నిర్వర్తించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరాశాఖలు ఈసారి పవన్‌కు కేటాయించారు. లోకేశ్‌కు ఈసారి... గతంలో తాను నిర్వర్తించిన ఐటీశాఖ సహా విద్య, మానవ వనరుల అభివృద్ధి, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలను కేటాయించారు. గత ఐదేళ్ల ప్రతిపక్షంలో.. పోలీసుల నుంచి అనేక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఎదుర్కొన్న ఎస్సీ నేత వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు.
పవన్‌కే పెద్దపీట
మంత్రి శాఖల కేటాయింపులో పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు పెద్దపీట వేశారు. 2014-19 మధ్య ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వగా... ఈసారి పవన్‌కల్యాణ్ ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ శాఖలు లోకేశ్ నిర్వహించారు. లోకేశ్ గతంలో నిర్వర్తించిన ఐటీశాఖతోపాటు విద్య, రియల్‌టైం గవర్నెన్స్ శాఖలు కేటాయించారు. ప్రతిపక్షంలో ఉండగా పో లీసుల నుంచి అనేక వేధింపులు ఎదుర్కొవడంతోపాటు, ఎస్సీ నేత అయి ఉండి కూడా అట్రాసిటీ కేసు ఎదుర్కొన్న వంగలపూడి అనితకు ఇప్పుడు అదే పోలీసులు సెల్యూట్ చేసేలా హోంశాఖను కేటాయించారు. మంత్రులతోపాటు, రాష్ట్ర ప్రజల ఉత్కంఠకు తెరదించుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులకు శాఖలను కేటాయించారు. సాధారణ పరిపాలనతో పాటు శాంతిభద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంచుకున్నారు.