ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈలో పర్యటనలో భాగంగా అబుదాబిలోని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) హిందూ మందిరాన్ని సందర్శించారు. ఆలయ సందర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాలలో ఒకటి అని అభివర్ణించారు. ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్రహ్మవిహారిదాస్ స్వామి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ విశిష్టతలను, అద్భుతమైన శిల్పకళను, ఆధునిక ఆవిష్కరణలను, ఐక్యత సందేశాన్ని ఆయనకు వివరించారు. ఆలయంలోని సుందరమైన, సున్నితమైన కళానైపుణ్యాన్ని చూసి ముగ్ధుడైన చంద్రబాబు, దీనిని "ఒక నిజమైన అద్భుతం" అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దుబాయ్ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పాలనలో సాంకేతికతను జోడిస్తూ వాట్సప్ ద్వారా 730కి పైగా పౌర సేవలను అందిస్తున్నామని, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చంద్రబాబు వివరించారు. అబుదాబీ, దుబాయ్ నగరాలు ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జి ఎకానమీ వైపు ఎలా పయనిస్తున్నాయో స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. లక్షన్నర హోటల్ రూములతో దుబాయ్ ఆతిథ్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తోందని, అదే తరహా అభివృద్ధిని ఏపీలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అబుదాబీ, దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జి ఎకానమీ దిశగా నడుస్తున్నాయి. 1.50 లక్షల హోటల్ రూములతో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతోంది’ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.