PAWAN: పిఠాపురం ఆడపడుచులకు పవన్ గిఫ్ట్
మహిళలకు 12 వేల చీరల పంపిణీ.. నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు;
కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సొంతఖర్చుతో ప్రత్యేక కానుకగా 12వేల చీరలు అందజేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్‌కల్యాణ్ పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారుచేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను సర్దారు. ఈ కార్యక్రమం రెండు రోజులుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్‌కల్యాణ్ నివాసంలో జరుగుతోంది. వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం ఉదయం పాదగయ క్షేత్రంలో అధికసంఖ్యలో పోటెత్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు 2వేల మందికే టోకెన్లు ఇవ్వగలిగారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా ఆరువేల మందితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఈఓ దుర్గాభవాని తెలిపారు.
నేడు పల్నాడులో చంద్రబాబు, పవన్ పర్యటన
వనం-మనం పేరిట పచ్చదనం పెంపు కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని పంచాయతీ పరిధిలోని JNTU ఆవరణలో 6 వేల మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పాల్గొని మొక్కలు నాటనున్నారు. అనంతరం అక్కడే జరగనున్న బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
ఒకే వేదికపైకి పవన్‌కళ్యాణ్.. బన్నీ!
కొన్ని రోజుల నుంచి మెగా.. అల్లు కుటుంబాల నడుమ కోల్డ్‌వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో ఇరు కుటుంబాల అభిమానులకు శుభవార్త అందింది. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశానికి 50 ఏళ్లు పూర్తి కానున్న వేడుకలకు డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హీరో అల్లు అర్జున్‌కు ఆహ్వానం అందింది. దీంతో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించనున్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి.