AP: నేడు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ భేటీ
పని సర్దుబాటుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం... ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నేతలకు పిలుపు;
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అభిప్రాయాలు తీసుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనర్ నేడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. గుర్తింపు పొందిన సంఘాల నాయకులను దీనికి ఆహ్వానించారు. రిజిస్టర్డ్ సంఘాల నుంచి లిఖిత పూర్వక లేఖలను తీసుకోవాలని నిర్ణయించారు. వీరి సూచనలు, సలహాల మేరకు పని సర్దుబాటు ప్రక్రియను కొనసాగించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే సంఘాల నాయకుల సూచనల మేరకు కొన్ని మార్పులు చేసింది.
ఆర్జేడీ, డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓలతో నిన్న నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో వీటిని వెల్లడించింది. మిగులుగా తేలిన పాఠశాలలో జూనియర్ ఉపాధ్యాయుడి స్థానంలో సీనియర్ విల్లింగ్ ఇవ్వడానికి అవకాశం కల్పించింది. 70 శాతం అంగవైకల్యం ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. వీరి స్థానంలో వేరే ఉపాధ్యాయుడిని మార్పు చేస్తారు. మిగులుగా తేలిన ఉపాధ్యాయులకు ఏమైన అభ్యంతరాలుంటే వాటిని తెలిపేందుకు అవకాశం కల్పించారు. ఈ మూడు కారణాలను డీఈఓ కార్యాలయం విడుదల చేసిన గూగుల్ షీట్ ద్వారా కమిషనరేట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత మిగులు ఉపాధ్యాయుల జాబితాను 16న కమిషనరేట్ విడుదల చేస్తుంది. 17, 19 తేదీల్లో మండల స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మండలంలో మిగిలిపోయిన టీచర్లను అదే మండలంలో వారి మాతృ పాఠశాలల్లోనే ఉంచి, విద్యా సంవత్సరంలో రాబోయే ఖాళీల్లో సర్దుబాటు చేసేలా ఎంఈఓలకు వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.
ఇస్రోలో పవన్
ఆంధ్రప్రదేశ్ యువతలో అపరిమితమైన జిజ్ఞాస ఉంది... దీన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుందవి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. శ్రీహరికోటలోని షార్‌లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరైన దారి చూపేవారు లేకపోవడం వలనే యువత ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్ర యువతకు దారిచూసే బాధ్యత ఇస్రో తీసుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు. యువతతో విజ్ఞానపరమైన విషయాలను పంచుకునేలా, విలువైన సూచనలు అందించేలా ఇస్రోతో ఎంఓయూకు ప్రయత్నిస్తానని పవన్ తెలిపారు. అంతరిక్ష రంగంలో మంచి అవకాశాలు వున్నాయి... కాబట్టి భావితరాలకు ఇటువైపు నడవాలని సూచించారు. అంతరిక్ష పరిశోదనలపై చిన్నప్పటినుండే ఆసక్తి ఏర్పర్చుకోవాలన్నారు. యువతకు అంతరిక్ష పరిశోధనలపై ఉన్న ఆకాంక్షకు తగినట్లుగా ఉపాధి మార్గం లేదంటే పరిశోధనల మార్గాన్ని ఇస్రో అధికారులు చూపాలన్నారు... తగిన గైడెన్స్ ఇస్తే యువత జీవితం మెరుగుపడటమే కాదు దేశానికి కూడా మంచి సేవలు అందుతాయన్నారు. గ్రామీణ, అర్భన్ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచేలా ప్రభుత్వం, ఇస్రో కలిసి ముందుకు వెళదాం... ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఎంఓయూ చేసుకుందామని పవన్ సూచించారు.