Ap : ప్రభంజన కూటమి.. వైకాపా ఓటమి

ప్రజలు ఇచ్చిన తీర్పు అసామాన్యం;

Update: 2024-06-05 01:15 GMT

 కూటమి అద్వితియ విజయ దుందిబి మోగించిన వేళ రాష్ట్ర శాసనసభకు కొత్తగా 81 మంది అభ్యర్థులు ఎన్నికయ్యారు. తెలుగుదేశం నుంచి పోటీ చేసిన పలువురి కుటుంబసభ్యులు సునాయాసంగా విజయతీరాలు చేరుకుంటే..... అదే సమయంలో వైకాపా నుంచి దిగ్గజాలు అనుకున్న నేతల వారసులు చతికిలపడ్డారు. అంతేకాకుండా కూటమి తరఫున అసెంబ్లీలోకి ఇద్దరు మాజీ ఐఏఎస్‌లు.. లోక్‌సభలోకి ఒక మాజీ ఐపీఎస్, ఐఆర్ఎస్ అడుగుపెట్టనున్నారు.   

2024 ఎన్నికలతో రాష్ట్ర అసెంబ్లీలోకి కొత్తగా 81 మంది అడుగుపెట్టనున్నారు. వీరిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితో పాటు గతంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన సుజనాచౌదరి, కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కూడా ఉన్నారు. వీరంతా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు. వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించడం సర్వసాధారణమే కానీ.., వారిని గెలిపించుకుని చట్టసభల్లోకి పంపడం అంత సులభం కాదు. కానీ.. కూటమి ప్రభంజనంతో తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య.., ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థులుగా దివంగత వరుపుల రాజా సతీమణి సత్యప్రభ గెలుపొందారు. తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో, ఆయన తనయుడు లోకేశ్ మంగళగిరిలో గెలిచారు. చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ హిందూపురంలో విజయం సాధించారు. బాలకృష్ణ మరో అల్లుడు ఎం. శ్రీభరత్ విశాఖ ఎంపీగా గెలిచారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా తరపున సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష పోటీచేసి.. మంత్రి సీదిరి అప్పలరాజుపై గెలిచారు. 

 రాజంపేట లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. ఆయన సోదరుడు కిశోర్‌కుమారెడ్డి పీలేరులో తెదేపా నుంచి గెలిచారు. టెక్కలిలో కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్నాయుడు విజయం సాధించారు. వాళ్లిద్దరూ బాబాయ్, అబ్బాయ్ అవుతారు. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు జేసీ అస్మిత్‌ రెడ్డి తాడిపత్రి నుంచి గెలిచారు. శ్రీసత్యసాయి జిల్లాలో మాజీమంత్రి పల్లె రఘునారెడ్డి కోడలు సింధూరరెడ్డి పుట్టపర్తి నుంచి గెలిచారు. ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ రెండోసారి గెలిచారు. ఈమె తల్లిదండ్రులిద్దరూ ప్రజాప్రతినిధులే. కర్నూలు తెదేపా అభ్యర్థి భరత్ గెలిచారు. ఈయన టీజీ వెంకటేశ్ కుమారుడు. పులివెందుల అసెంబ్లీ నుంచి జగన్, ఆయన సోదరుడు వైఎస్ అవినాష్‌రెడ్డి కడప లోక్‌సభ నుంచి గెలిచారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి... కమలాపురం అసెంబ్లీ, సోదరి షర్మిల కాంగ్రెస్ తరపున కడప లోక్‌సభ నుంచి పోటీచేసి ఓడారు. 

 

Tags:    

Similar News