AP: జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ
సంచలన విషయాలు బయటపెట్టిన ప్రధాన నిందితుడు... కీలక వీడియో బయటపెట్టిన అద్దేపల్లి జనార్దన్‌రావు.. ప్రభుత్వ మారగానే నకిలీ మద్యం తయారీ ఆపివేత..
ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దేపల్లి జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు ఆయన చెప్పారు. అయితే, ఏపీలో ప్రభుత్వం మారగానే నకిలీ మద్యం తయారీ నిలిపివేశామని జనార్దన్ రావు చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం తయారీ వెనుక జరిగిన అన్ని విషయాల్నీ జనార్దన్‌రావు ఒక వీడియో రూపంలో వెల్లడించారు. ఇప్పుడు ఈ వీడియో రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. ‘‘ఏప్రిల్‌లో జోగి రమేశ్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు సహకరించాలని కోరారు. నకిలీ మద్యం తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నాం. రమేశ్ ఆదేశాలతో తంబళ్లపల్లిలో తయారీ ప్రారంభించాం. తంబళ్లపల్లి అయితే చంద్రబాబుపై బురద జల్లోచ్చని చెప్పారు. ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.” అని జనార్దన్‌రావు వెల్లడించారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ మళ్లీ నకిలీ మద్యం తయారు చేయమన్నారని జనార్దన్ రావు వెల్లడించారు. 'కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే కుట్రతో.. మళ్లీ నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ నాతో చెప్పారు. ఇబ్రహీంపట్నంలో పెట్టాలని అనుకున్నా కానీ, జోగి రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాం. తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే ప్రభుత్వంపై బురద జల్లొచ్చని జోగి రమేష్ అన్నారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు' అని జనార్థన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు." అని తెలిపారు.
కూటమి సర్కార్‌కు చెడ్డపేరు తేవాలనే..
"నన్ను కావాలనే ఆఫ్రికాలోని నా మిత్రుడి వద్దకు పంపారు. జోగి రమేశ్ తన మనుషులతో లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. తెదేపా వారిని చంద్రబాబు సస్పెండ్ చేయడంతో ప్లాన్ మార్చారు. ఇబ్రహీంపట్నంలోనూ సరకు తెచ్చి పెట్టాలన్నారు. ఇబ్రహీంపట్నం గోదాములో ముందురోజే సరకు తెచ్చిపెట్టారు. మళ్లీ లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు. పథకం ప్రకారం చంద్రబాబు సర్కారుకు చెడ్డపేరు వచ్చిందని రమేశ్ చెప్పారు. అనుకున్నట్టే అంతా జరిగింది.. నువ్వు ఆఫ్రికా నుంచి రావొద్దని చెప్పారు. అంతా నేను చూసుకుంటా.. బెయిలిప్పిస్తా అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత హ్యాండిచ్చారు. నా తమ్ముడిని కూడా ఇరికించారు. జయచంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదని జోగి రమేశ్ నమ్మించారు. జయచంద్రారెడ్డికి.. నకిలీ మద్యం తయారీకి సంబంధం లేదు. రమేశ్‌తో చిన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది. నమ్మించి మోసం చేశారు. అందుకే బయటకు వచ్చి నిజం చెబుతున్నా’’ అని జనార్దన్‌రావు తెలిపాడు.
భార్యాబిడ్డల సాక్షిగా తప్పూ చేయలేదు"
జనార్ధన్ రావు ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. కల్తీ మద్యం కేసును దమ్ముంటే సీబీఐకు అప్పగించాలన్నారు. నకిలీ మద్యం కేసు విచారణను సిట్‌కు అప్పగించారన్న జోగి రమేష్.. ఆ సిట్.. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనేలా ఉంటుందని విమర్శించారు. ఎవరో ఒకర్ని నకిలీ మద్యం కేసులో ఇరికించాలనే కుట్ర జరుగుతోందని జోగి రమేష్ ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే కేసును సిట్ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా విచారణ చేయించాలన్నారు. నకిలీ లిక్కర్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్న జోగి రమేష్.. తనకు సంబంధం ఉందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. రిమాండ్ రిపోర్టులోనూ తన పేరు లేదని వెల్లడించారు. ఈ విషయంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అని చంద్రబాబుకు, నారా లోకేష్‌కు జోగి రమేష్ సవాల్ విసిరారు.