AP: ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల
600 కోట్ల రూపాయలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం;
ఫీజు రియంబర్స్ మెంట్ కోసం600 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేశామని ఉన్నత విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడతగా ఫీజు రియంబర్స్ మెంట్ కు సుమారు రూ. 788 కోట్లు చెల్లించామని సర్కార్ పేర్కొన్నారు. త్వరలో మరో రూ. 400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఇక, దశల వారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని వెల్లడించింది. విద్యార్థులను ఇబ్బంది పెడితే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంపై అటు కళాశాలలు, ఇటు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ఢిల్లీ టూర్
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లపై సీఎం వారితో చర్చించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తదితరులతో సీఎం న ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు జరుపనున్నారు. 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు.