AP: భూ కబ్జా చేస్తే కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టం

భూ కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికే కొత్త చట్టం... భూమిని ఆక్రమిస్తే బయటకు రాలేరన్న చంద్రబాబు;

Update: 2024-11-24 02:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల భూములు కబ్జా చేసేవారికి కఠిన శిక్షలు పడతాయని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన భూ కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికే కొత్త చట్టం వచ్చిందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. కొత్తగా తెచ్చిన భూ దురాక్రమణ నిరోధక చట్టం ప్రకారం భూములు కబ్జా చేస్తే పది నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు భారీ జరిమానాలు పడతాయని కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అధికారులు ఎవరైనా దీనికి సహకరిస్తే వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుందని చెప్తున్నారు. పేదలు, సామాన్యుల భూములకు రక్షణ కల్పించడానికే కూటమి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందని.. ఏపీ మంత్రులు స్పష్టం చేస్తున్నారు. జగన్‌ హయాంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలలా భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రికి రాత్రి భూమి రికార్డులు మార్చివేసి భూములు కొట్టేశారని గుర్తు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ మాజీ మంత్రి బొత్స కుటుంబం 2,000 ఎకరాల భూమిని కొట్టేసిందన్న ఆరోపణలు వచ్చాయని అంటున్నారు.


వైసీపీ హయాంలో భారీగా అవినీతి..!

అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్‌ రూ.30 కోట్ల విలువైన 160 ఎకరాల భూములను కొట్టేసి తన భర్త పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే... ‘గుడ్‌మార్నింగ్‌’ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకొంటూ మరో పక్క భూములు మింగేశారని మండిపడ్డారు. ఇటువంటి భూ రాబందులకు వైసీపీలో లెక్కే లేదని,... వీరి చేతుల్లో చిక్కుకొన్న భూములను వెనక్కు తీసుకోవడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. సామాన్యుల హక్కులను కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా జగన్‌రెడ్డి ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కబ్జా చేస్తే బయట తిరగలేరు

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తున్నామని.. ఇకపై ఎవరైనా భూమిని దురాక్రమిస్తే బయట తిరగలేరని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భూమిని ఆక్రమిస్తే చట్ట ప్రకారం శిక్ష పడటంతో పాటు భూమి కూడా పోతుందని చెప్పారు. భూ ఆక్రమణల కేసులను డీఎస్పీ లేదా ఇంకా పై స్థాయి అధికారి విచారిస్తారని.. భూమిని ఆక్రమించిన వాళ్లకు ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూ అక్రమణలకు పాల్పడ్డారని.. రైతులకు నోటీసు కూడా ఇవ్వకుండా రెవెన్యూ రికార్డులు మార్చారని.. ఏదైనా సమస్య ఉంటే హైకోర్టుకు వెళ్లమని చెప్పారు. హైకోర్టుకు వెళ్లడం రైతుకు సాధ్యమేనా అని వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆ చట్టాలను కాల్చేసి అప్పట్లో నిరసన తెలిపామని గుర్తు చేశారు. అందుకే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‎ను రద్దు చేశామని తెలిపారు. ఆ చట్టాన్ని రద్దు చేశాం కానీ.. అందులో జరిగిన అవకతవకలను ఏం చేయాలేకపోతున్నామన్నారు. 

Tags:    

Similar News