ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన బార్ పాలసీ విధానాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ నూతన పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు నడుపుకోవచ్చని సూచనలు చేసింది ప్రభుత్వం. ప్రజారోగ్యం, పారదర్శకత ను దృష్టిలో పెట్టుకొని నూతన పాలసీని రూపొందించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. కాగా.. లైసెన్స్లకు దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించనున్నారు. ఈ నూతన పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విధానం ప్రకారం ప్రతి బార్ లైసెన్స్ కు కనీసం 4 దరఖాస్తులు రావాలనే నిబంధన పెట్టారు. అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలు, అదనంగా రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లైసెన్స్ ఫీజు జనాభా ప్రతిపదనకన నిర్ణయిస్తారు. 50 వేలు కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.35 లక్షలు, 50 వేలు నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.55 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు 5.75 లక్షలు గా ఫీజును నిర్ణయించారు. ఇందులో ఎటువంటి పైరవీలు ఉండవని పారదర్శకంగా లాటరీ పద్ధతిలోనే లైసెన్సులు కేటాయించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.