AP: బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ

ఇద్దరి మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు... ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం;

Update: 2025-03-20 03:30 GMT

ఏపీ సీఎం చంద్రబాబు.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‍గేట్స్ తో కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో గేట్స్ ఫౌండేషన్ - ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సుపరిపాలన, ఉపాధి కల్పన అంశాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. అన్ని రంగాల్లో ఏఐ అనుసంధానం, ఉత్తమ ఫలితాల సాధనకు సహకారాన్ని గేట్స్ ఫౌండేషన్ అందించనుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించారు.

సమావేశం బాగా జరిగిందన్న చంద్రబాబు

బిల్ గేట్స్ తో మీటింగ్ బాగా జరిగిందని చంద్రబాబు వెల్లడించారు. వివిధ అంశాలపై బిల్‍గేట్స్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఎక్కువ సహకారం అందిస్తామని.. ఏపీలో పర్యటనకు బిల్‍గేట్స్ ను ఆహ్వానించామని చంద్రబాబు చెప్పారు. త్వరలోనే బిల్‍గేట్స్ ఏపీలో పర్యటిస్తారని... తిరుమలను సందర్శించాలని బిల్‍గేట్స్ ను కోరానని అన్నారు. ఏపీతో పాటు జాతీయ స్థాయిలోనూ వివిధ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సేవలు అందించాలనే ఆలోచనలో ఉన్నారని వెల్లడించారు. బిల్‍గేట్స్ తో తనది సుదీర్ఘ అనుబంధమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనికత సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లక్ష్య సాధనకు ఈ భాగస్వామ్యం కీలకపాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నామన్న చంద్రబాబు.. ఏపీ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞలు తెలిపారు.

భారత పార్లమెంట్‌కు బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పార్లమెంటు‌ను సందర్శించారు. అనంతరం ప్రపంచ ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన, వ్యవసాయ ఆవిష్కరణలలో భారతదేశం పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ ఛాలెంజింగ్ ఆశయాలతో ముందుకెళుతోంది. నమ్మశక్యం కాని స్థాయిలో ఆవిష్కరణలు చేయడంలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది’ అని బిల్ గేట్స్ కొనియాడారు.

Tags:    

Similar News