AP High Court: అమరావతిని అభివృద్ధి చేయాల్సిందే: ఏపీ హైకోర్టు తీర్పు
AP High Court: జగన్ ప్రభుత్వానికి హైకోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో ఉండాల్సిందేనని విస్పష్టంగా చెప్పింది;
AP High Court: జగన్ ప్రభుత్వానికి హైకోర్ట్ భారీ షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో ఉండాల్సిందేనని విస్పష్టంగా చెప్పింది. సీఆర్‌డీఏ చట్టం, మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం ప్రకారమే నడుచుకోవాలని తేల్చి చెప్పింది. రాజధాని పిటిషన్లపై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది.
రాజధాని పిటిషన్లపై సంచలన తీర్పే ఇచ్చింది హైకోర్టు. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కూడా తీర్పు ఇచ్చింది. అధికారం లేనప్పుడు సీఆర్‌డీఏ చట్టం రద్దు కూడా కుదరదని తేల్చి చెప్పింది ధర్మాసనం. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాల్సిందేనని, రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశించింది.
అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని స్పష్టంగా చెప్పింది. ఇతర అవసరాలకు రాజధాని భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని చెప్పింది హైకోర్టు. ఏ ఒక్క కార్యాలయాన్ని కూడా అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదంది.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేశారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ప్రకటించారు. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా పరిగణిస్తూ చట్టం తెచ్చారు. సెక్రటేరియట్, గవర్నర్ కార్యాలయం విశాఖలో ఏర్పాటవుతాయని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.
దీంతో ఆగ్రహించిన రైతులు సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో పాటు మరికొంత మంది కోర్టుకెళ్లారు. అమరావతిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులను తీసుకొచ్చారని రైతుల తరపు న్యాయవాదులు వాదించారు. పక్కా ప్లాన్ ప్రకారమే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపును రంగంలోకి దించి మూడు రాజదానులకు అనుకూలంగా నివేదికలు ఇప్పించిందన్నారు.
ఆ కమిటీలు రైతుల ప్రయోజనాలను లెక్కలోకి తీసుకోలేదని, అమరావతిపై టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన వేల కోట్ల ప్రజాధనాన్ని కూడా విస్మరించాయని వాదించారు. రాజధాని పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే.. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ తాము దాఖలు చేసిన పిటిషన్లలో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని పిటిషనర్ల తరపున లాయర్లు వాదించారు.
తమ అభ్యర్ధనలపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసేలా, ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని కోరారు. సీఆర్‌డీఏ చట్టాన్ని ఏ స్ఫూర్తితో తయారుచేశారో.. అదే స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. అంతేకాదు, రాజధానిలో ఆగిపోయిన పనులను తిరిగి కొనసాగించేలా డైరెక్షన్ ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు.