లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఏపీ ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ‘మన మిత్ర’ సేవల ద్వారా ఇంటర్ ఫలితాలను వాట్సప్‌లోనూ అందించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఫలితాల భయంతో విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యవారి కోడూరుకు చెందిన సుధీశ్వర్ రెడ్డి అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నేడు ఇంటర్ ఫలితాలు వెల్లడి కానున్న వేళ.. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పరీక్షల భయంతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు.